Home Page SliderTelangana

ఎల్లారెడ్డిలో వార్ వన్ సైడేనా!?

గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో భారీ విజయాలు నమోదు చేసిన గులాబీ పార్టీ, ఎల్లారెడ్డిలో మాత్రం చిత్తుగా ఓడింది. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిపై 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జాజుల సురేందర్ భారీ విజయాన్ని సాధించారు. కాంగ్రెస్ పార్టీలో విజయం సాధించినప్పటికీ సురేందర్ ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత మదన్ మోహన్, బీజేపీ నేత సుభాష్ రెడ్డితో తలపడుతున్నారు. బలమైన అభ్యర్థి అన్వేషణలో ఉన్న హస్తం పార్టీ ఇక్కడ్నుంచి కె మదన్మోహన్‌ను పోటీకి దింపింది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి… ఉపఎన్నికతో సహా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన నియోజకవర్గం మారి బాన్స్‌వాడ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. ఎల్లారెడ్డిలో సురేందర్ మరోసారి గెలుస్తారా లేదంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందో చూడాలి.

ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోలింగ్ బూత్‌లు 270 ఉండగా, పురుష ఓటర్లు 1,04,768 స్త్రీ ఓటర్లు 1,12,673 ట్రాన్స్ జెండర్లు ముగ్గురు ఉన్నారు. మొత్తం ఓటర్లు 2,17,444 ఉన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముదిరాజ్‌లు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం ఓటర్లలో వారి జనాభా 15 శాతానికి పైగా ఉంది. రెడ్లు 11 శాతానికి పైగా ఉండగా, మాదిగలు 10 శాతం వరకు ఉన్నారు. మున్నూరు కాపులు తొమ్మిదిన్నర శాతం వరకు ఉన్నారు. లాంబాడ 9 శాతానికి దగ్గరగా ఉన్నారు. మాలలు 8 శాతానికి పైగా ఉండగా, పద్మశాలీలు 7 శాతానికి పైగా ఉన్నారు. గొల్లలు 7 శాతం, గౌడ 5 శాతం, ఆర్య క్షత్రియ 4 శాతం ఉండగా ఇతరులు 12 నుంచి 15 శాతం వరకు ఉన్నారు.