NationalNews

మహా ముదురు ఎక్‌నాథ్ షిండే

Share with

ఉద్ధవ్ థాక్రేకు చుక్కులు చూపిస్తున్న ఏక్‌నాథ్ షిండే ఎవరన్నదానిని తెలుసుకునేందుకు నెటిజన్లు సోషల్ మీడియాను జల్లెడ పడుతున్నారు. బీజేపీకి కొరకరాని కొయ్యాల మారిన శివసేనను ముప్పుతిప్పులు పెడుతున్నా ఘటికుడు ఎవరా అని తెలుసుకోవాలని ఉబలాటపడిపోతున్నారు. 28 నవంబర్ 2019న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్ థాక్రే ఎన్నో విపత్కర పరిణామాలను తట్టుకొని ప్రభుత్వాన్ని పాలిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు సొంత పార్టీకి చెందిన ఒకే ఒక్కడు చుక్కలు చూపిస్తున్నాడు. ఏక్‌నాథ్ షిండే శివసేన ముఖ్యుడు. మహా వికాస్ అగాడి ప్రభుత్వంలో పట్టణ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు. ఉదయం వరకు ఎవరికీ అందుబాటులో లేని షిండే.. ప్రస్తుతం శివసేనకు వ్యతిరేకంగా అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. ముంబైకి సమీపంలోని థానేలో శివసేనకు కీలక నాయుకుడుగా షిండే ఎదిగాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేశారు. ఇటీవల మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేతో కలిసి.. షిండే అయోధ్య సైతం వెళ్లివచ్చారు. షిండే కోప్రి పచ్చికాడి నుంచి మహారాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. 2004, 2009, 2014, 2019లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో గెలుపు తర్వాత… శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా, ఆ తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. శివసేనలో ప్రజాబలం ఉన్న నాయకుల్లో షిండే ఒకరు. బహిరంగ సభలు నిర్వహించడంలో ఆయన దిట్ట. షిండే తనయుడు శ్రీకాంత్ షిండే లోక్‌సభ ఎంపీగా, సోదరుడు ప్రకాష్ షిండే కౌన్సిలర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొంత కాలంగా తనను పార్టీ పట్టించుకోవడం లేదన్న ఆవేదనలో షిండే ఉన్నట్టు తెలుస్తోంది. షిండేకు అటు బీజేపీ, ఎన్సీపీ నేతలతోనూ సన్నిహిత సంబంధాలున్నాయ్. ఎక్ నాథ్ షిండే కారణంగానే… శివసేన పార్టీ థానేలో బలీయశక్తిగా ఎదిగింది.