కాంగ్రెస్ నావ మునుగుతోందా..?
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ నావ మునుగుతోందా..? కోమటిరెడ్డి బ్రదర్స్ వివాదం.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి క్షమాపణలు.. సీనియర్ నాయకుల వ్యాఖ్యలు చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఆ పార్టీ వాళ్లే సమాధి కట్టేట్లు కనబడుతోంది. దీనంతటికీ ప్రధాన కారణం రేవంత్‌రెడ్డి ఒంటెత్తు పోకడలేననే వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌రెడ్డికి ఏకంగా పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల ఆ పార్టీ సీనియర్లు రగిలిపోతున్నారు. టీఆర్‌ఎస్ జైత్రయాత్రను నిలువరించాలంటే రేవంత్ వంటి దూకుడు స్వభావం గల నాయకుడే సరైనోడని కాంగ్రెస్ అధిష్ఠానం భావించింది. అయితే.. పార్టీలోని సీనియర్లను కలుపుకొని పోవడంలో విఫలమయ్యారంటూ రేవంత్‌పై రోజుకో నాయకుడు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

రేవంత్ వల్ల పార్టీకి నష్టం: మర్రి శశిధర్‌రెడ్డి
తాజాగా వివాదాలకు దూరంగా ఉండే మర్రి శశిధర్‌రెడ్డి కూడా నోరు విప్పడాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ చేయి దాటిపోతోందని తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో కల్లోలానికి రేవంత్‌రెడ్డి వైఖరే కారణమని, ఆయన పార్టీకి నష్టం చేసే పనులు చేస్తున్నారని శశిధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పైగా పార్టీకి తెలంగాణ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్.. రేవంత్‌కు ఏజెంట్‌లా పని చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలోని సీనియర్లను అగౌరవపరిచినా రేవంత్‌ను అధిష్ఠానం ఎందుకు మందలించలేదని ప్రశ్నించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో రేవంత్ తీరు సరిగ్గా లేదన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

జారుకుంటున్న సీనియర్లు
నిజానికి 2014లో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో ప్రధాన ప్రతిపక్ష పాత్రను కూడా కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడు తెలంగాణాపై బీజేపీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు సన్నద్ధమవడంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో ఉంటూనే పార్టీకి ద్రోహం చేస్తున్నారనే అనుమానాలను పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రేవంత్‌కు సన్నిహితుడైన కొండా విశ్వేశ్వరరెడ్డి, పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్.. బీజేపీలో చేరడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పాతాళానికి పోయింది.

సీనియర్ల గరం
రేవంత్‌రెడ్డి అంటే ఒంటికాలి మీద లేచే జగ్గారెడ్డి ప్రస్తుతానికి మౌనంగానే కనిపిస్తున్నా.. దసరా రోజున బాంబు పేలుస్తానంటున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధుయాష్కీ గౌడ్ బహిరంగ లేఖ రాసి రచ్చ చేశారు. మరో సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు కూడా రేవంత్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. మొత్తానికి రాష్ట్ర పార్టీ పగ్గాలు రేవంత్ చేతికి వచ్చిన తర్వాత ఆయన తనదైన దూకుడు వ్యవహారంతో కాంగ్రెస్‌లో ఎంతోకాలంగా కొనసాగుతున్న సీనియర్లను దూరం చేసుకున్నారు. పార్టీలో క్రమశిక్షణ మచ్చుకైనా కనిపించడం లేదు. పైగా ఎనిమిదేళ్లుగా పార్టీ అధికారానికి దూరంగా ఉండటం.. ఓ వైపు టీఆర్‌ఎస్, మరోవైపు బీజేపీ నాయకులు బుజ్జగించో, బెదిరించో తమ వైపునకు తిప్పుకోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

