International

అమ్మాయిల క్రికెట్‌ కీలక సెమీస్‌ నేడే- ఇంగ్లాండ్‌తో ఢీకొట్టబోతున్న భారత్

Share with

కామన్వెల్త్ క్రికెట్‌లో భారత అమ్మాయిల జట్టు బలమైన ఇంగ్లండ్ జట్టుతో ఈరోజు తలపడబోతోంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకంగా మారింది. హోరాహోరీగా జరగనున్న ఈ మ్యాచ్ లో విజయం సాధించడంపైనే భారత్ దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు ఈటోర్నీలో ఓటమి ఎరుగని ఇంగ్లండ్ మంచి ఫామ్‌లో ఉంది. మరోవైపు మెదటి మ్యాచ్ అసీస్ చేతిలో పరాజయం పాలైనా … ఆ తరువాత జరిగిన రెండు మ్యాచ్‌లలో మంచి ప్రతిభ కనపరిచి భారత జట్టు మంచి జోరుమీదుంది.

ఈరోజు కీలకమైన సెమీస్‌లో ఏ జట్టుకు విజయావకాశాలు ఉన్నాయో, అసలు భారత జట్టు బలాబలాలు ఏంటో చూద్దాం. ముందుగా బలహీనతలు చెప్పుకుంటే భారత్ బ్యాటింగ్‌లో స్థిరత్వం లేదు. మెదటి మ్యాచ్‌లో ఆఫ్ సెంచరీ చేసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బార్బడోస్‌పై డకౌట్ అయిపోయింది. పాక్‌పై 50 రన్స్ చేసిన స్మ్పతి మంధాన కూడా బార్బడోస్‌ మ్యాచ్ మొదట్లోనే పెవిలియన్ దారి పట్టింది. దీన్నిబట్టి సెమీస్ లాంటి కీలక మ్యాచ్‌లో సమిష్టిగా రాణిస్తేనే అనుకున్న ఫలితం లభిస్తుంది. కానీ యువ ఓపెనర్ షెఫాలీ వర్మ గత మూడు మ్యాచ్‌లలో 157.35 స్ట్రెక్ రేట్‌తో 107 పరుగులు సాధించి ధాటిగా ఆడడం టీమ్ ఇండియాలో కొత్త ఆశలు రేకెత్తించింది. ఇండియా సెమీస్ వరకూ రావడానికి ప్రధాన కారణం రేణుకా సింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మూడు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి ప్రత్యర్ధి జట్లను కట్టడి చేసింది. తాడోపేడో తేల్చుకోవలసిన బార్బడోస్ మ్యాచ్‌లో బ్యాటర్లు బెదిరిపోయేలా వికెట్లు తీసి భారత విజయానికి దోహదపడింది. ఇంగ్లండ్ జట్టులో ఓపెనర్లు ఫామ్‌లో లేకపోవడం వారికి నష్టం.. మనకు కలిసొచ్చే అంశం.

రేణుకకు తోడుగా దీప్తి శర్మ, పూజా వస్తాకర్, రాధా యాదవ్, మేఘనా సింగ్, స్నేహ రాణా, స్మ్పతి మంధాన మొదలైన వాళ్లందరి ఆటతీరు కూడా చాలా మెరుగ్గా ఉంది. అందరూ కలసికట్టుగా, అవగాహనతో ఆడితే సెమీస్‌లో భారత విజయం సునాయాసమే అని క్రికెట్ పండితులు భావిస్తున్నారు.