NewsTelangana

బీజేపీలో జోరుగా చేరికలు – ఈటల రాజేందర్

Share with

తెలంగాణా ఉద్యమకాలంలో ఉన్న ఉద్యమకారులు అందరూ ఒక్కొక్కరుగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్  పార్టీలను వీడుతున్నారన్నారు బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్. టీఆర్‌ఎస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడం వల్లే పార్టీని వీడి సీనియర్ నాయకులు బీజేపీలో చేరుతున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గురుకులాలు చాలా బాగా ఉండేవని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక విద్యా వ్యవస్థను పూర్తిగా పట్టించుకోవడం మానేశారన్నారు. వందల సంఖ్యలో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల ఉపయోగం లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి మనుమడిని  అలాంటి హాస్టల్లో ఉంచితే ఆ తల్లిదండ్రులు పడే బాధ అర్థం అవుతుందన్నారు. తిండి సరిగాలేక, వసతులు, ఇతర సదుపాయాలు కరువై విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రెసిడెన్షియల్ పాఠశాలల సమస్యలు తీర్చాలని ఈటల డిమాండ్ చేసారు. బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 21న అమిత్‌షా సమక్షంలో దాసోజు శ్రవణ్, రాజగోపాల్ రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రాజయ్యయాదవ్, ఇంకా మరికొంతమంది బీజేపీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతోందని, రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చక చాలామంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నారనీ జోస్యం చెప్పారు.