NationalNews

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాలు పెరుగుదల

Share with

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాలు పెరుగుదల

◆ మళ్లీ తెరపైకి అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియ
◆ పలు సందర్భాల్లో సీట్ల పెంపు లేదన్న కేంద్రం
◆ కానీ రాజకీయ పార్టీలలో చిగురుస్తున్న ఆశలు
◆ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న ఆశావహులు
◆ రాజకీయ పార్టీలలో మొదలైన సందడి

తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచే దిశగా కేంద్రం దృష్టిపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన నాటి నుంచే ఈ అంశంపై పలుమార్లు చర్చకు వచ్చినప్పటికీ… అలాంటిదేమి లేదని చాలా సందర్భాల్లో పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కానీ అసెంబ్లీ సీట్లు పెంపు ప్రస్తావన రావడంతో మళ్లీ రాజకీయ పార్టీల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్రం జారీ చేసే ప్రకటన కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. 2019 ఎన్నికలతో పోలిస్తే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేయడానికి యువత కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రెండుగా చీలే నియోజకవర్గాలపై ఔత్సాహికులు దృష్టి సారిస్తున్నారు. మళ్లీ తెర మీదకు అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారం రావడంతో ఆయా రాజకీయ పార్టీల్లో సందడి నెలకొంది.

ఏపీ, తెలంగాణలోని రాజకీయపార్టీలకు త్వరలోనే కేంద్ర సర్కార్ తీపి కబురు చెప్పనుందా ..! నిజానికి అసెంబ్లీ స్థానాల పెంపుపై విభజన చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి… ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్రం దృష్టికి తీసికెళ్లినప్పటికీ… ఆ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు. ప్రస్తుతం విభజన చట్టంలోని హామీల ప్రకారం ఏపీలో ఉన్న స్థానాలను 175 నుంచి 225కి పెంచే విధంగా.. అలాగే తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153 పెంచే ప్రక్రియకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోందన్న వార్తలపై చర్చనీయాంశంగా మారాయి.ఈ మేరకు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టేందుకు అనువుగా అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ పంపాలని తెలుగు రాష్ట్రాలను కేంద్ర న్యాయ శాఖ కోరిందని.. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీలైనంత త్వరగా రిపోర్ట్ వెళ్తే.. వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే అసెంబ్లీ స్థానాలపై పెంపుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. కేంద్రం నుంచి ఏమైనా ఆదేశాలు అందాయా అనేది కూడా తెలియరాలేదు. అయితే వచ్చే ఏడాది ఎన్నికల దృష్ట్యా ఆలోపే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారా..? లేక ఆ తరువాత పూర్తి అవుతుందా అనే దానిపై రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే గతంలో కేంద్రం చేసిన పలు ప్రకటనల దృష్ట్యా… ఈ వార్తలను పలువురు కొట్టిపారేస్తున్నారు.

పార్లమెంట్ వేదికగా కేంద్రం క్లారిటీ…

ఇదే అంశంపై పార్లమెంట్ లో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్రం స్పష్టమైన ప్రకటనలు చేసింది. మాల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి… గతేడాది ఆగస్టులో జరిగిన సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రశ్నించారు. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా పెంచాల్సిన అవసరం ఉందన.., ఈ దిశగా కేంద్రం ఎప్పుడు చర్యలు తీసుకుంటుందని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ.. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో లేదని స్పష్టం చేశారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 170లో చెప్పినట్లు 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని వెల్లడించారు.తెలుగు రాష్ట్రాల్లో ఇప్పట్లో సాధ్యం కాదనుకున్న నియోజకవర్గాల పెంపు నిజంగానే ఉంటుందా..? ఒకవేళ అదే నిజమైతే ఏ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు పెంచుతారో.. ఈ ప్రక్రియ ఎవరికి ప్లస్ అవుతుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!