NewsTelangana

ఆత్మవిశ్వాసానికి కేరాఫ్ అడ్రస్ ఈటల

Share with

ఆత్మవిశ్వాసం మార్కెట్లో కొనుక్కునేది కాదు… ఆత్మబలం మరెవరో ఇస్తే లభించేది కాదు.. ఆత్మగౌరవం కోసం జీవితం మొత్తం కొట్లాడిన ఆ వ్యక్తి ఇప్పుడు నిజమైన ఆత్మగౌరవాన్ని తెలంగాణ ప్రజలకు సిద్ధించేలా చేయడం కోసం అసలు యుద్ధాన్ని మొదలుపెట్టాడు. పాలకుల ముసుగులో చేసే దౌర్జన్యాలను అంతం చేసేందుకు రాజేంద్రుడు ఇప్పుడు నడుంబిగించాడు. తెలంగాణ ప్రజల కోసం జీవితాన్ని పణంగా పెట్టి… అధర్మంపై పోరాటానికి ఆస్తులు పోయినా పర్లేదనుకునే ధీశాలిగా ఆవిర్భవించారు. ఈటల ఇప్పుడు తెలంగాణ ప్రజలకు చోధక శక్తిగా లభించారు. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో… అదే వ్యక్తిత్వం ఉన్న అసమాన ధీరుడు మన రాజేంద్రుడు.

ఈటెల రాజేందర్… తెలంగాణ రాజకీయాల్లో బలమైన నాయకుడుగా ఎదగాలనుకున్నాడు. రాజకీయాలు కేవలం పైసలుంటేనే… పరపతి ఉంటేనో… వారసత్వం ద్వారానో మరి వేరే వాటి వల్ల రాదని తెలుసుకున్నాడు. రాజకీయం ప్రజలతో… ప్రజల కోసం చేయాలనుకున్నాడు. అందుకే ఆయన సొంత నియోజకవర్గ హుజూరాబాద్‌లో పేరు పెట్టి పిలిచే కార్యకర్తలు, సాధారణ పౌరులు వేలల్లో ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఆయన ఇచ్చిన ధైర్యం ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కొత్త దిశానిర్దేశం చేస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్… రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జమునను వివాహం చేసుకొని ఆదర్శ భావజాలాన్ని వ్యాప్తి చేశారు. వామపక్షభావాలున్న ఈటల… ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రైట్ వింగ్ పాలిటిక్స్ వైపు మొగ్గు చూపారు. ఈటల స్వస్థలం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రం…

ఏదైనా చేయాలని కోరిక ఉండటం, ఆలోచన చేయడం ఎవరైనా చేసే పనే. కానీ ఈటల మాత్రం తన మార్క్ చూపించాలని తపించేవారు. అది పౌల్ట్రీ అయినా.. పాలిటిక్స్ అయినా.. రెంటిలోనూ తనదైన ముద్ర వేసి ఔరా అన్పించుకున్నారు. శత్రువులు సైతం ప్రేమించే గొప్ప మనసు రాజేందర్‌ది. పౌల్ట్రీ రంగంలో అడుగుపెట్టి ఆర్థికంగా అంచలంచెలుగా ఎదిగిన ఈటల… అటు రాజకీయాల్లోనూ ఒక్కో మెట్టు ఎక్కారు. కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడతారని మనసా వాచా నమ్మారు. అందుకే తెలంగాణ కోసం తాను కూడా అదే దారిలో నడిచాడు. 2001లో జలదృశ్యంలో టీఆర్ఎస్ స్థాపించినప్పటి నుండి ఈటల రాజేందర్ కేసీఆర్ వెన్నంటి ఉన్నారు. రాజకీయాల్లోకి ఈటల అడుగు పెట్టిన నాటి నుంచి వ్యాపార బాధ్యతలన్నీ భార్య జమును చూసుకోగా… రాజేందర్ పూర్తిగా ప్రజలతో మమేకమై… పూర్తి జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేశారు. అందుకే టీఆర్ఎస్ పార్టీలో కుదుపు వచ్చినప్పుడు హేమాహేమీలు ఓడినా.. ఈటలను మాత్రం ప్రజలు ఎప్పుడూ ఆదరించారు. అఖండ మెజార్టీలతో గెలిపించి అభిమానాన్ని చాటుకున్నారు.

టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు… అంటే 2001 నుంచి 2014వరకు టీఆర్ఎస్ సభలు, సమావేశాలకు ఈటెల రాజేందర్ ఆర్థిక సహకారం అందించేవారు. పార్టీకి ఏ సాయం కావాలన్నా… రాజేందర్‌తో మాట్లాడండని నాడు కేసీఆర్ చెప్పేవారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు… వివిధ పనుల నిమిత్తం షామీర్‌పేట‌లోని ఈటెల ఇంటికి వచ్చేవారు ఎవరైనా భోజనం చేయకుండా వెళ్ళరంటే అతిశయోక్తి కాదు… టీఆర్ఎస్‌లో కేసీఆర్ తమ్ముడు అనే సంభోదించే వ్యక్తి ఈటెల రాజేందర్ మాత్రమే… ఆడిగిన వారికి కాదనకుండా సహాయం చేస్తారని ఈటల కుటుంబానికి గుర్తింపు ఉంది. రాజకీయాల్లో ఇప్పటి వరకు అవినీతి మరక లేని వ్యక్తి ఈటల రాజేందర్. అలాంటిది ఉన్నట్టుండి తెలంగాణ ప్రభుత్వం ఈటల రాజేందర్‌పై అసైన్డ్ భూముల ఆక్రమణ కేసులు బనాయించి.. అభాసుపాలయ్యింది. రాజకీయంగా ఎదుగుతున్నాడన్న కక్షతో ఈటల రాజకీయ జీవితాన్ని ధ్వంసం చేయాలని చూశాడు కేసీఆర్. కానీ అరచేతిలో సూర్యకాంతిని ఆపడం ఎవరి తరం. అదే ఈటల విషయంలో నిజమయ్యింది. ప్రజల్లో ఈటల పట్ల కేసీఆర్ ఇమేజ్ రోజు రోజుకు పెరిగిందే కానీ తగ్గలేదు.

కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్ రావు, కవిత తర్వాత టీఆర్ఎస్ లో అంతటి ప్రాధాన్యత పొందారు ఈటల రాజేందర్. ఇదంతా ఎవరో ఇస్తే లభించేది కాదు… వ్యక్తిత్వంతో
సాధించింది. సుఖాలు మీరే పొందండి… కష్టం ఉంటే నేనున్నాననే తత్వం ఈటలది. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణులు వివిధ పనుల కోసం ఈటెల రాజేందర్‌ను కలిసేవారు. వారందరి సమస్యలకు పరిష్కారం చూపేవారు. పార్టీ పట్ల కార్యకర్తలకు, నాయకులకు నమ్మకం కలిగించిన ధీరుడు ఈటల రాజేందర్. ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ… క్రమేపీ టీఆర్ఎస్‌లో ఈటెల రాజేందర్ పవర్ సెంటర్‌గా మారాడు. పార్టీలో నంబర్ టూ కావడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోయాడు. రాజకీయంగా ఈటల రాజేందర్… పార్టీలో ఉంటే ముప్పని భావించారు. అందుకే ఈటలను టీఆర్ఎస్ నుండి బయటకు పంపాలని నిర్ణయించుకుని… అసైన్డ్ భూముల వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చాడు కేసీఆర్.

ఈటలపై అకారణంగా దాడి చేస్తూ… బద్నాం చేసే కేసీఆర్ కుట్రలను ప్రజలు ఈసడించుకున్నారు. ప్రజల్లో ఉండే ఈటలపై ఇలాంటి విమర్శలు చేస్తావా అంటూ ప్రశ్నించారు. అందుకే హుజూరాబాద్ ఉపఎన్నికల కేసీఆర్ అండ్ కో వందల కోట్లు ఖర్చు చేసినా… ప్రజలు ఈటలను ఆశీర్వదించారు. కేవలం అభిమానం చూపించడమే కాదు… భారీ మెజార్టీతో గెలిపించి రాజేందర్ తలరాతను మార్చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించండని దీవించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల విజయం సాధించిన తర్వాత కేసీఆర్ మరింత కక్ష పూరితంగా వ్యవహరిస్తుంటే… అంతే ధైర్యంగా కేసీఆర్‌ను ఎదుర్కొంటూ ఈటల ముందుకు సాగుతున్నారు. కుటుంబపాలన అంతం కోసం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా మార్గదర్శనంలో తెలంగాణ విముక్తి కోసం పోరాడతానంటూ వినమ్రపూర్వకంగా చెబుతారు ఈటల.