Andhra PradeshNewsNews Alert

వివాదాల వీడియో.. చిక్కుల్లో వైసీపీ సర్కార్

Share with



విపక్షాలకు అస్త్రం దొరికింది. విమర్శల శరాలను దూస్తున్నాయి. అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక్కసారిగా రాజకీయ వేడిని పెంచేశాయి. దేశవ్యాప్తంగా చర్చకు తెర తీశాయి. బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధుల పాత్ర, నడవడిక, ప్రజా సంబంధాలు, వ్యవహార తీరు. ఈ అంశాలే ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేస్తున్నాయి. అధికార వైసీపీని అడకత్తెరలో నొక్కుతున్నాయి. ఓ వీడియో వివాదంలో చిక్కుకున్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చుట్టూ ఉచ్చు బిగిసేలా చేస్తున్నాయి. తీవ్ర దుమారాన్ని రేపుతూ ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. దేశ అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వ్య‌క్తి అసభ్యంగా వ్యవహరించడాన్ని విపక్ష పార్టీలు తప్పుబడుతున్నాయి. ఈ వ్యవహారమంతా ఓ ఫేక్ అంటూ అధికార పార్టీ కొట్టి పారేస్తోంది. ఈ వివాదం నుండి తాను కడిగిన ముత్యంలా బయటపడతానని మాధవ్ చెబుతున్నా.. పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం కూడా లేకపోలేదని వైసీపీ భావిస్తోంది. ఈ ప్రకంపనలు ఇప్పుడు ఢిల్లీని కూడా తాకుతున్నాయి.


గోరంట్ల మాధవ్. నిన్న మొన్నటి వరకు ఆయనో పోలీస్ అధికారి. అంతేకాదు .. పోలీస్ అధికారుల సంక్షేమ సంఘానికి నాయకత్వం కూడా వహించాడు. ఉద్యోగ నిర్వహణలో ఉండగానే ఆయనపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. మీసం మెలేసి ఖబడ్దార్ అంటూ టీడీపీ నేతలకు వార్నింగ్ ఇవ్వడంతో అందరి దృష్టిలో పడ్డాడు. నాలుకలు చీరేస్తానంటూ మండి పడ్డాడు. ఆ డాషింగ్ నేచరే వైసీపిని ఆకట్టుకుంది. ఇలాంటోడు ఒక్కడుంటే చాలు టీడీపీని ఉతికి ఆరేయడానికి అనుకున్నారు. పదవికి రాజీనామా చేయించి పార్టీ తీర్ధం ఇచ్చారు. అంతే.. అప్పటి నుండి మాధవ్ తన భక్తిని చాటుకుంటూ వచ్చాడు. వైసీపీని ఓ ఆలయంగా.. జగన్ ను ఓ దేవుడుగా భావిస్తూ వచ్చాడు. ఆశీస్సులు లభించాయి. దానితో పాటు హిందూపురం ఎంపీ టికెట్టు వర ప్రసాదంగా పొందాడు. జనంలోకి వెళ్ళాడు. టీపీడీని తూర్పూర పట్టాడు. విజయాన్ని దొరకపుచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన దేశ అత్యున్నత చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బాధ్యతాయుతమైన ఎంపీ. ఏం చూసి అక్కున చేర్చుకున్నారో .. ఆయన నుండే ఇప్పుడా పార్టీకి కష్టాలు వచ్చి పడ్డాయి. విమర్శలు శరసంధానంగా దూసుకు వస్తున్నాయి. ఆయనకు సంబంధించిన ఓ న్యూడ్ వీడియో ఇప్పుడు విపక్షాల చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది. సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అయ్యింది. దీనిపై టీడీపీ విరుచుకు పడింది. ఎంపీ పదవికే కళంకం తెచ్చేలా మాధవ్ వ్యవహరించారని ఆ పార్టీ మహిళా నేతలు దుయ్యబట్టారు. సభ్య సమాజం తలదించుకునేలా వైసీపీ ఎంపీ తీరు ఉందని మండిపడ్డారు. మాధవ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీ పదవికి ఆయనను అనర్హుడిగా ప్రకటించాలనంటున్నారు.


విపక్షాల విమర్శలను తిప్పి కోడుతూ అధికార పార్టీ వైసీపీ ఆత్మ రక్షణ చర్యలకు దిగింది. మాధవ్ పై వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా ఫేక్ అంటూ.. అది మార్ఫింగ్ చేసిందని విపక్షాలపై ప్రతి దాడికి దిగింది. అయితే ఇందులో నిజానిజాలు నిగ్గు తేలాల్సి ఉందని అంటూ… నిజమని తేలితే మాత్రం పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే ఇలాంటి ఘటనలను ఉపేక్షించే ప్రశ్నేలేదు. ఇంకెవరూ అవాంఛిత ఘటనలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. అది వందకు వంద శాతం మార్ఫింగ్ వీడియో అని వాదిస్తున్నారు గోరంట్ల మాధవ్. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కానందున దానిపై ఓ స్పష్టతకు రాలేమని పోలీసులు కూడా చెబుతున్నారు. అయితే వీడియోలో ఉన్నది మాధవా? కాదా ? అనేది ఒరిజినల్ వీడియో దొరికితేనే తేలుతుందని చెప్పడాన్ని కూడా విపక్షాలు తప్పుబడుతున్నాయి. యూకేకు చెందిన ఓ నెంబర్ నుండి వీడియో వైరల్ అయ్యిందని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని కొట్టి పారేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ పార్టీకి చెందిన పంజాబ్ ఎంపీ జస్బీర్‌ సింగ్‌ గిల్‌ ప్రధాన మంత్రికి ఓ లేఖ రాస్తూ .. మాధవ్ వ్యవహారం పార్లమెంట్ వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు. అలాగే లోక్ సభ స్పీకర్ తో పాటు జాతీయ మహిళా కమిషన్ కు కూడా ఆయన లేఖలు రాశారు. ఎంపీ అన్న పదానికి మాధవ్ లాంటి వారు అర్ధాలు మార్చేస్తున్నారని , ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.


గతంలో కూడా వైసీపీ నేతలపై అనేక విమర్శలు వచ్చాయి. అవన్నీ కూడా ఫేక్ అని తేలిపోయాయి. ఇప్పుడు ఇదే అంతే.. అంటూ ఆ పార్టీ నేతలు సమస్యను చక్కదిద్దే ప్రయత్నాల్లో పడ్డారు. తమ పార్టీపై ఎలాంటి మచ్చ లేకుండా చూసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మాధవ్ ను రక్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారంటూ టీడీపీ మాత్రం వదలకుండా విమర్శలు చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు మాధవ్ ఫోన్ ను ఎందుకు సీజ్ చేయలేదంటూ టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. మాధవ్‌ను ఎలాగైనా కాపాడాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందంటూ టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గోరంట్ల వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు .. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ.. కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌షాను కూడా కలవబోతోంది. మొత్తానికి ఈ వ్యవహారం మాటల మంటలను రాజేస్తోంది. మాధవ్ తన సహజ ధోరణిని ప్రదర్శిస్తూ .. ప్రతి దాడికి దిగుతుంటే.. విపక్షాలు మాత్రం అతడిని బర్తరఫ్ చేసే వరకు పోరాడతామని అంటోంది. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు ఒకరికి ఒకరు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారని, ఇవే అనేక అనుమానాలకు తావిస్తోందని ఎంపీ రఘురామకృష్ణంరాజు అంటున్నారు. వివాదాస్పద వీడియోను ఫోరెన్సిక్ కు పంపారంటున్నారు వైసీపీ నేతలు.. కానీ.. ఫోరెన్సిక్ కు పంపలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ అనేక సందేహాల తేనెతుట్టెను రేపుతున్నాయి. ఒకవైపు దొరికిన అవకాశం.. మరోవైపు ఆత్మ రక్షణ కోసం ఆరాటం.. ఇంకోవైపు తనకు తెలిసిన పోలీస్ విద్యతో బయట పడేందుకు ప్రయత్నం. ఎవరికి వారే నెగ్గాలని ధోరణి. ఈ పోరులో వాస్తవాలు బయటపడతాయా.. నిజానిజాలు తేలుతాయా.. అన్నదే సందేహం. చూద్దాం ఏం జరగబోతోందో.