Home Page SliderTelangana

తనిఖీల పేరుతో సామాన్యులను దోచేస్తున్నారుగా..!

తెలంగాణాలో ఈ నెల 9వ తేదిన  ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. దీని ప్రకారం రాష్ట్రంలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం డిసెంబర్ 3వ తేదిన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో  ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిది. దీంతో కేంద్ర  ఎన్నికల సంఘం నగదు,బంగారం,విలువైన వస్తువులు వంటి వాటిపై ఆంక్షలు విధించింది. దీని ప్రకారం తెలంగాణాలో ఎవరైనా రూ.50,000/- పైబడి నగదు తీసుకు వెళ్తే దానికి సంబంధించిన రశీదులు చూపించాల్సి ఉంటుంది. కాగా రశీదులు చూపించలేని పక్షంలో పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ విధంగా ఇప్పటివరకు తెలంగాణా పోలీసులు 109 కోట్ల రూపాయలను పట్టుకున్నారు. అయితే ఇందులో రాజకీయ నాయకుల బ్లాక్ మనీ కంటే సామాన్యుల నుంచి పట్టుకున్న డబ్బే ఎక్కువగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాగా ఇప్పటివరకు సీజ్ చేసిన 109 కోట్లలో 70 శాతం సామాన్యులు వివిధ అవసరాల కోసం తరలిస్తున్న నగదు,బంగారం ఉన్నట్లు ఆఫీసర్లే చెప్పడం గమనార్హం. రాజకీయ నాయకుల సొమ్ము,ఐటీ లెక్కల్లో చూపించని నగదు చేరాల్సిన చోటకి చక్కగా చేరుతుందన్నారు. అయితే  పోలీసులు వాటిని వదిలేసి సామాన్యులు,చిరు వ్యాపారులు పొట్ట కట్టుకొని సంపాదించిన డబ్బును పట్టుకుంటున్నారని మండిపడుతున్నారు.కొందరు హాస్పటల్ ఖర్చుల కోసం,పెళ్లిళ్ల కోసం,ఇళ్లు కొనడానికి తెచ్చుకున్న డబ్బును కూడా పట్టుకుంటున్నారని బాధపడుతున్నారు. అయితే అప్పోసోప్పో చేసి తెచ్చే డబ్బుకు రశీదులు ఎలా చూపించాలంటున్నారు. మరికొందరు ఆధారాలు చూపించినప్పటికీ పోలీసులు వారి డబ్బును సీజ్ చేస్తున్నారని చెప్తున్నారు.దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు.