అమెరికా,ఐరోపాల్లో పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు
ఈమధ్య కొత్తవైరస్‌లతో వచ్చే వ్యాధులు మానవజాతిని మరింతగా భయపెడుతున్నాయి. కరోనాతో ఉక్కిరిబిక్కిరై కాస్త కోలుకుంటున్న ప్రజలను మంకీపాక్స్ కంగారుకి గురిచేస్తోంది. మే నుండి మంకీపాక్స్ వ్యాప్తి పెరిగిందనే వార్తలు వచ్చాయి. పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ వైరస్ మిగతా ప్రపంచానికి మెల్లగా విస్తరిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. PHEC అనగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్‌నేషనల్ కన్సర్న్‌ని అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితిగా పిలుస్తారు. దేశాలు దాటి ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరించే వ్యాధుల కారణంగా ప్రజల ఆరోగ్యానికి ఆందోళన కలిగిన సందర్భాలలో దీనిని ప్రకటిస్తారు. మంకీపాక్స్ గతంతో పోలిస్తే ప్రస్తుత లక్షణాలలో తేడాలున్నట్లు బ్రిటిష్ మెడికల్ జర్నల్ BMJ లో ప్రచురించిన అధ్యయనంలో తెలిసింది. ఈవ్యాధి స్వలింగ సంపర్కులలో ఎక్కువగా వ్యాపిస్తోందని తేలింది. 197 మంది పురుషులపై అధ్యయనం చేయగా, వారి జననాంగాలలో వాపు, నొప్పి ఉన్నట్లు తేలింది. లక్షణాలు కనిపించని వ్యక్తులనుండి కూడా ఈ వ్యాధి సోకుతుందని పేర్కొన్నారు.
ఇదికూడా స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందినదే. జంతువుల నుండి మనుషులకు సోకుతోంది. ఇది తుంపర్ల ద్వారా, దగ్గు, లేదా వ్యాధిగ్రస్తునికి దగ్గరగా ఉండడం వల్ల గానీ ఒకరినుండి ఒకరికి వ్యాపిస్తోంది. ఇది మనుషులలో పూర్తిగా వ్యాప్తి చెందడానికి 6నుండి 13 రోజులు పడుతుంది. ఒక్కొక్కసారి 21 రోజులు కూడా పట్టవచ్చు. దీనిని కోతులలో 1958లో గుర్తించారు. మొదటిసారిగా 1970లో మనుషులలో బయటపడింది. కోతులే కాకుండా ఎలుకలు, చుంచులు, ఉడతల నుంచి కూడా ఇది వ్యాప్తి చెందుతోంది. WHO సంస్థ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఐరోపా, అమెరికా దేశాలపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని, ఆందోళన వ్యక్తం చేసారు. 70 శాతం కేసులు ఐరోపాలో, 25 శాతం కేసులు అమెరికా ప్రాంతం నుండి బయటపడ్డాయని పేర్కొన్నారు. ఈవైరస్ బాధితులు ఇంతవరకూ 18 వేలమందికి పైగా ఉన్నారు. ఇది పురుషులలోనే ఎక్కువగా ఉందని శృంగార భాగస్వాములను తగ్గించుకోవాలని, అలా ఆవ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని సూచించారు.