మహారాష్ట్రలో, ‘మహావ్యూహం’తో దూసుకుపోతున్న కారు
తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన జోరుగా సాగుతోంది. 600 కార్లతో, రెండు బస్సులతో అట్టహాసంగా షోలాపూర్ వెళ్లారు కేసీఆర్. బీఆర్‌ఎస్‌ను జాతీయపార్టీగా మార్చాలనే దృఢసంకల్పంతో అక్కడి నేతలను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇప్పుడు పండరీ పూర్ రైతు జాతరను టార్గెట్ చేశారు. రైతులను ఆకట్టుకుంటే ప్రభుత్వంలో చోటు సంపాదించవచ్చదేని ఆయన పథకం. ఈ జాతరకు 30 లక్షల మంది రైతులు వస్తారని అంచనా. ‘ఆప్ కీ పాస్ కిసాన్ సర్కార్’ అంటూ రైతులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ జాతరను వినియోగించుకుంటే బీఆర్‌ఎస్ పార్టీకి మంచి భవిష్యత్ లభిస్తుంది. ఇప్పటికే గతంలో నాందేడ్, నాగపూర్‌లో పర్యటించిన ఆయన, ఇప్పుడు పండరీపురం, షోలాపూర్‌లను టార్గెట్ చేశారు. మహారాష్ట్రకు తెలంగాణాకు బోర్డర్‌లో ఉండడం, చాలామంది ప్రజలు తెలంగాణలో కూడా మహారాష్ట్రీయులు కావడం వల్ల ఇక్కడి స్కీములు వారికి సుపరిచితమే. అక్కడ రకరకాల పార్టీలు ఉండడం. వాటిమధ్య కీచులాటలు, అంతర్గత పోరులతో సతమతమవడం కూడా బీఆర్‌ఎస్‌కు కలిసివచ్చే అంశంగానే చెప్పవచ్చు. బీజేపీ, శివసేనల రాజకీయాలతో విసిగిపోయిన ప్రజలకు రైతు నినాదంతో వస్తున్న ఈ పార్టీ ఆశాకిరణంలా గోచరించవచ్చు.

హైదరాబాద్ అన్ని రంగాలలో సూపర్ ఫాస్ట్‌గా దూసుకుపోతూండడం కూడా తెలంగాణ అభివృద్ధిని బాగా ప్రదర్శించే అంశమే. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ ఫార్ములానే ఇప్పుడు మహారాష్ట్రలో కూడా పాటిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రైతులు కూడా ఈ సభకు రావడం వల్ల మహారాష్ట్ర, కర్ణాటక రైతులను కేసీఆర్ తన వాక్చాతుర్యంతో, రకరకాల పథకాలతో ఆకట్టుకునే అవకాశం ఉంది. నెమ్మదిగా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో బీఆర్‌ఎస్ పార్టీని కొంచెం కొంచెంగా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు భావించవచ్చు. కోమల్ దూబేతో పాటు NCP నేత భగీరథ్ బాల్కే కూడా నేడు బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారని సమాచారం.

