బీజేపీకి ఈసీ ఝలక్… వివరణ ఇచ్చిన పార్టీ
తెలంగాణ బీజేపీకి కేంద్ర ఎన్నికల కమీషన్ షాకిచ్చింది. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ప్రచారానికి బ్రేక్ పడింది. `సాలు దొర – సెలవు దొర` ప్రకటనలపై నిషేధం విధించింది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు ముద్రించడానికి ఈసీ అనుమతిని నిరాకరించింది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కించపరిచేవిధంగా పోస్టర్లు, ఫోటోలు, రాతలు ఉండకూడదని ఎన్నికల కమీషన్ తెలిపింది. `సాలు దొర – సెలవు దొర` క్యాంపెయిన్‌కు అనుమతి కోరుతూ మీడియా సర్టిఫికేషన్ కమిటీకి బీజేపీ దరఖాస్తు చేసుకుంది. బీజేపీ విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. కొద్దిరోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ టూర్‌కు వచ్చిన సందర్భంలో ఆయనపై విమర్శలతో పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఆ తర్వాత కేసీఆర్‌పైనా పలు ఆరోపణలు చేస్తూ కొన్ని చోట్ల పోస్టర్లు కనిపించిన విషయం మనందరికీ తెలిసిందే.