అమరప్రేమకథ- భార్య మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భర్త
నిజజీవితంలో జరిగే కొన్ని సంఘటనలు సినిమా కథలను తలపిస్తాయి. నిన్న సికింద్రాబాద్‌లో జరిగిన సంఘటన అలాంటిదే. ప్రేమించి, పెళ్లిచేసుకున్న భార్య, బిడ్డను ప్రసవించే క్రమంలో చనిపోవడాన్ని తట్టుకోలేని భర్త రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన చూసేవారిని కంటతడి పెట్టిస్తోంది. నారాయణపేట్ జిల్లా మక్తల్‌కు చెందిన ఉప్పరి ఆంజనేయులు కుమారుడు నవీన్ కుమార్ అనే యువకుడు వారి ఇంటికి దగ్గరలోని భీమేశ్వరి అనే యువతి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఏడాది క్రితం వివాహం చేసుకుని మౌలాలిలోని ప్రగతినగర్‌లో కాపురముంటున్నారు. నవీన్ ఆటో నడుపుతూ ఉంటారు. భీమేశ్వరి గర్భవతిగా ఉండి ఈ నెల 18 వతేదీన సాయంత్రం నొప్పులు రావడంతో ఇరుగుపొరుగువారి సహాయంతో నేరేడ్‌మెట్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ప్రసవానంతరం భీమేశ్వరి పరిస్థితి క్షీణించిడంతో తల్లిని, బిడ్డను గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. చిన్నారి పరిస్థితి కూడా బాగాలేకపోవడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. భీమేశ్వరి పరిస్థితి విషమించి మృతి చెందింది. దీనితో నవీన్ కుమార్ తీవ్ర బాధకు లోనై భరించలేక రైలుకింద పడి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఆరోజు రాత్రి సంజీవయ్య పార్కు రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై మృతదేహాన్ని చూసిన ఆర్‌పీఎఫ్ హోంగార్డు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు మృతుడి జేబులోని సెల్‌ఫోన్ ఆధారంగా కుటుంబసభ్యులకు తెలియజేసారు. వీరిద్దరి మృతదేహాలు గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉన్నాయి. వారి బిడ్డ కూడా అదే ఆసుపత్రిలో అనాధగా వెంటిలేటర్‌పై ఉండడం చూసిన వారి హృదయాలు బరువెక్కుతున్నాయి.

