మూడో రోజు ఈడీ విచారణ పై సర్వత్రా ఉత్కంఠ
ఇటీవల క్యాసినో కేసులో నిందితులుగా ఉన్న చికోటి ప్రవీణ్ , మాధవ రెడ్డిలను ఈడీ గత రెండు రోజులుగా విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే మూడో రోజు సైతం విచారణకు చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డిలు హాజరయ్యారు. ఈ రోజు విచారణలో భాగంగా విదేశాలకు నగదు బదిలీ చేసిన అంశంపై ఈడీ ఆరా తీయనుంది. అంతే కాకుండా హావాలా చెల్లింపుల విషయం పై కూడా కూపీలాగుతున్నారు. ఇప్పటికే మొదటి రెండు రోజుల్లో చికోటి ప్రవీణ్‌కి చెమటలు పట్టించిన ఈడీ. నేటి విచారణలో భాగంగా కేసుకు సంబందించిన కీలక విషయాల గురించి ప్రశ్నలు సంధించనుంది. ఈ నేపథ్యంలో చికోటి ప్రవీణ్ , మాధవ రెడ్డిలు క్యాసినో పేరుతో విదేశాలకు తరలించిన నగదు ఎంత? అనే విషయాన్ని రాబట్టనుంది.
అసలు ఆ నగదు ఎవరిది అనే కోణంలో విచారణ చేసిన ఈడీ , ఆ వీదేశీ బ్యాంకు ఖాతాలు ఎవరివో ఇప్పటికే గుర్తించినట్టు వెల్లడించింది. హైదరాబాద్ హావాల చెల్లింపుల్లో ఏజెంట్ల పాత్ర ఎంత? దీనిలో ఎంత మంది సినీ స్టార్స్ , రాజకీయ నేతలు, వీఐపీల హస్తం ఉందన్న అంశాలలో ఈడీ విచారణ జరపనుంది. ఈడీ నోటిసుల ఊహాగానాలపై అనుమానితుల్లో ఆందోళనలు నెలకొనగా , ఈ విషయంలో పలువురు ప్రముఖుల పేర్లు కూడా తెరపైకి వస్తాయన్న ఊహాగానాలపై స్వతంత్ర ఉత్కంఠ నెలకొంది.