Andhra PradeshNews

ఇక్కడే ఉంటా.. మీ సంగతి తేలుస్తా..

టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు పట్టణంలో టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 3 రాజధానులు కావాలని డిమాండ్‌ చేస్తూ వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది. చంద్రబాబు గో బ్యాక్‌ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తే… సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ టీడీపీ కార్యకర్తలు పోటీగా నినాదాలు చేశారు. కొద్దిసేపు అక్కడ తోపులాట ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో చంద్రబాబు అక్కడికి రావడంతో ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది.

వైసీపీ శ్రేణులు చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఉన్నా వైసీపీ కార్యకర్తలను అదుపు చేయకపోవడంతో చంద్రబాబు మండిపడ్డారు. ఎస్పీ ఏం చేస్తున్నారు? ఎవరికి కాపాలా కాస్తున్నారు? పోలీసులు యూనిఫాం తీసేసి రావాలన్నారు. మీతో కాకపోతే మేమే చూసుకుంటామని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పేటీఎం బ్యాచ్‌కు బిర్యానీ పొట్లాలు ఇచ్చి రెచ్చగొట్టి పంపారని మండిపడ్డారు. ఈ రాత్రికి ఇక్కడి ఉండి… మీ సంగతి తేలుస్తానన్నారు. రాయలసీమలో ముఠా నాయకులను అణచివేసిన పార్టీ టీడీపీనే అన్నారు. మిమ్మల్ని అణచివేయడం కష్టమేమీ కాదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులంతా ఓ మాఫియాగా మారారన్నారు. రాష్ట్రానికి ఎన్ని రాజధానులు కావాలి.. ఒకటి సరిపోదా? అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు తెలిపారు.