ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే హైకమాండ్ చూస్తూ ఊరుకోదు
తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గాంధీభవన్‌కు వచ్చారు. ఉదయం నుంచి సీనియర్ నేతలను పిలిపించి మాట్లాడుతున్నారు. కీలక పదవుల్లో ఉన్న సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ కమిటీలపై అసంతృప్తి వ్యక్తం చేయడంపై దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీని రక్షించాల్సిన మీరే.. సమస్యగా మారితే ఎలా? అని ఫైర్ అయ్యారని సమాచారం. జూనియర్, సీనియర్ పంచాయితీ మంచిది కాదు, సమస్యలుంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలని సూచించారు. నేతల అభిప్రాయాలను ఆయనే స్వయంగా నమోదు చేసుకున్నారు. అందరితో ఒకేసారి కాకుండా ఒక్కొక్కరితో ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తున్నారు. మీడియాతో మాట్లాడొద్దు, ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే హైకమాండ్ చూస్తూ ఊరుకోదు అని దిగ్విజయ్ గట్టిగా వార్నింగ్ చేశారని తెలుస్తోంది. పార్టీలో రేగిన చిచ్చును చల్లార్చేందుకుగాను రెండు రోజులపాటు ఆయా నేతలతో దిగ్విజయ్ చర్చలు జరపనున్నారు.

