పొత్తులు ఖరారు… త్యాగాలకు సిద్ధం కండి..!
◆ రాజకీయ చాణక్యానికి చంద్రబాబు మరింత పదును
◆ ఎన్నికలకు ఏడాదిన్నర ముందే పటిష్టమైన కార్యాచరణ
◆ 175 నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిలతో వరస భేటీలు
◆ ఇప్పటికే 111 నియోజకవర్గాల్లో పూర్తయిన సమీక్షలు
◆ కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలుపైనా రివ్యూ
ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర గడువున్నప్పటికీ టీడీపీ అధినేత ముందస్తు ఎన్నికల ఖాయమన్న భావనలో తన వ్యూహాలకు పదును పెడుతూ మరింత జోరుగా ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. తనతోపాటు ఎన్నికల కోసం పార్టీ యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేస్తూ రానున్న ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోనే 175 నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిలతో వరస భేటీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకొని దానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 111 నియోజకవర్గాల ఇన్చార్జిలతో వరుస సమీక్షల నిర్వహించి నేతల పనితీరును అధ్యయనం చేస్తున్నారు. పనితీరు సరిగా లేని నేతలకు సీరియస్ వార్నింగ్‌లు ఇస్తూ పనితీరు మెరుగుపరుచుకునేందుకు కొంత గడువిస్తున్నారు. ఇదే సమయంలో మంచి పని తీరుతో ఆకట్టుకుంటూ నియోజకవర్గంలో పనిచేస్తున్న నేతలకు వచ్చే ఎన్నికలుకు బెర్త్ కేటాయిస్తూ అనూహ్య నిర్ణయాలకు తెరతీస్తున్నారు.

ఇప్పటివరకు 111 నియోజకవర్గాల సమీక్షలు పూర్తి చేసిన చంద్రబాబు దాదాపు 70 మంది ఇన్చార్జిలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. నవంబర్ చివరి నాటికి ఇన్చార్జిలతో భేటీలు పూర్తిచేసి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టాలని చంద్రబాబు భావిస్తున్నారట. తాజాగా గురువారం తన సొంత నియోజకవర్గ కుప్పం తో పాటు తన తనయుడు లోకేష్ నియోజకవర్గం మంగళగిరి పై కూడా సమీక్ష నిర్వహించి పార్టీ శ్రేణులకు స్పష్టమైన సందేశాన్ని అందించారు. సమీక్షలలో ఎవరికి మినహాయింపు ఉండదన్న అంశాన్ని పార్టీలో అందరికీ ఒకే నిబంధనను అమలు చేస్తాననే స్పష్టమైన సంకేతాలను తన కేడర్‌కు పంపించారు. తనయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పై కూడా ఆయనతోనే స్వయంగా సమీక్షించి అక్కడ ఉన్న పరిస్థితులు వివరాలను ఆయనకు వెల్లడించారు. నారా లోకేశ్‌తో వన్ టూ వన్ మాట్లాడిన చంద్రబాబు అత్యథిక మెజార్టీతో మంగళగిరిలో గెలిచి చరిత్ర తిరగరాయాలని లోకేష్‌కి సూచించారు. తాను ఓడినా నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు చేరువ అవ్వగలిగామని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ… నియోజకవర్గంలో సొంతంగా సహాయ కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల ప్రజల మనసులు గెలుచుకున్నామని లోకేష్ వివరించినట్లు సమాచారం.

గత ఎన్నికల్లో ఓటమిని పట్టించుకోకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ మంగళగిరిలో గెలిచి చరిత్ర తిరగరాయాలని సమిష్టిగా పనిచేస్తే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తిరుగులేని విజయం సాధించేలా ఉండాలని నారా లోకేశ్‌కు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దీంతోపాటు చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టమైన అంశాలను కూడా భేటీలో వివరిస్తున్నారు. ఒకవేళ పొత్తుల అవకాశాలు ఉంటే పార్టీ కోసం త్యాగానికి సిద్ధంగా ఉండాలని ఇప్పటినుంచే వారికి స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారట. నియోజకవర్గ ఇన్చార్జిలతో సమీక్షలు పూర్తి అయిన వెంటనే జిల్లాల పర్యటనతో పాటు రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి లతో కూడా భేటీ అయి ఎన్నికలకు సన్నద్ధం చేసే దిశగా చంద్రబాబు కార్యాచరణను రూపొందించి ముందుకు సాగుతున్నారు. ఈసారి ఎన్నికలు అన్ని పార్టీలకు అత్యంత కీలకం కానుండటంతో చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని చూపించి అధికార పీఠం కైవసం చేసుకునేందుకు అడుగులు వేస్తున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

