హైదరాబాద్ ఢిల్లీలా కాకూడదు
హైదరాబాద్‌లో కాలుష్యాన్ని అదుపు చేసి, ఢిల్లీ వంటి పరిస్థితులు తలెత్తకుండా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం జీవో నెంబర్ 41 ద్వారా నూతన ఈవీ పాలసీని తీసుకువచ్చిందని, ఇప్పటివరకు 1,59,304 ఎలక్ట్రిక్ వాహనాలకు సుమారు రూ.806.35 కోట్ల రాయితీలు కల్పించినట్లు వెల్లడించారు. 2047 నాటికి రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ ఓఆర్ఆర్ (ORR) వెలుపల పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా జీవో 263 ద్వారా 20 వేల ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఆటోలు, 10 వేల సీఎన్‌జీ, 10 వేల ఎల్పీజీ మరియు 25 వేల రెట్రో ఫిటెడ్ ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి గుర్తుచేశారు. నగరంలో ఛార్జింగ్ స్టేషన్ల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, కంపెనీలు , డీలర్లు ఈ ఈవీ పాలసీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. అలాగే జనవరిలో నిర్వహించనున్న ‘రోడ్ సేఫ్టీ మంత్’ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు, ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.

