NewsTelangana

కడెంలో కంగారు

Share with

తెలంగాణా జిల్లాలలో గత వారం రోజులుగా ఆగని, ఎడతెగని వర్షాల కారణంగా సాధారణ జనజీవనానికి చాలా అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యారు. చాలామంది పునరావాసకేంద్రాలలో తల దాచుకున్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు పడటంతో అక్కడి నుంచి వాగుల్లో భారీ వరద మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా, కడెం మండలం సమీపంలోని గోదావరికి ఉపనది అయిన కడెం నదిపై రిజర్వాయర్‌లో నిర్మల్, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని కురిసిన భారీ వానల కారణంగా భారీగా వరదనీరు చేరింది. జలాశయానికి రెండువైపులా పరిమితికి మించి ప్రవహిస్తోంది. ఎన్ని టిఎమ్‌సీల నీరు ప్రవహిస్తోందో కూడా లెక్కవేయలేని పరిస్ధితి కొనసాగుతోంది. కడెం గ్రామంలో  అందరూ ఇళ్లు వదిలి బడి వద్దకు రావాలంటూ చాటింపు కూడా వేయించారు. జోరు వానలోనూ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్లు వదలి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు.

అటవీ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాల స్థాయి తెలియకపోవడంతో.. అధికారులు భారీ వరదను అంచనా వేయలేకపోయారు. ఇక్కడి కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులో ఒక్కసారిగా ఐదు లక్షల క్యూసెక్కుల వరద రావడంతో కంగారుపడ్డారు. ఒక్కసారిగా వచ్చిన వరదతో కడెం పరీవాహక ప్రాంతంలో పంటచేలన్నీ కొట్టుకుపోయాయి. కిలోమీటర్ల పొడవు రోడ్లు తెగిపోయాయి. విషయం తెలియగానే కలెక్టర్‌ అలీ, ఎస్పీ ఇతర అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ఖానాపూర్‌ మీదుగా వెళ్లే 61 నంబర్‌ జాతీయ రహదారి తెగిపోవడంతో నిజామాబాద్, జగిత్యాల జిల్లాల మీదుగా చుట్టూ తిరిగి కడెం చేరుకున్నారు. అప్పటికే స్థానిక అధికారులకు సమాచారమిచ్చి, ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాలను ఖాళీ చేయించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం ఉదయమే కడెం చేరుకుని పరిస్థితిని గమనించారు. మొత్తం 18 గేట్లలో 17 గేట్లను ఎత్తేశారు. బుధవారం మధ్యాహ్నం ఎడమ కాల్వ వద్ద గండిపడి, నీళ్లు దిగువకు వెళ్లిపోతున్నాయి.  వరద నీరు తగ్గడంతో ముప్పు తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ప్రమాదం ఏం లేదని చెబుతున్నారు.  ప్రాజెక్టుకు వచ్చే ఇన్‌ఫ్లో కూడా కాస్త తగ్గుముఖం పట్టిందని అధికారులు చెప్పడంతో ప్రజలు కాస్త కుదుటపడ్డారు.