భారీగా పెరిగిన కందిపప్పు ధరలు..
దేశంలో నిత్యవసర సరుకుల ధరలు రోజురోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. జూలై రెండో వారం నుంచి కందుల ధర పెంపు ఉంటుందన్న కేంద్రం అంచనాకు అనుగుణంగా ధర పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో కంది పప్పు 200 రూపాయలకు పైగా పలుకుతోంది. దీంతో మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు కందిపప్పును కొనలేని పరిస్థితి నెలకొంది. తమిళనాడు, కేరళలో పప్పులు ఇప్పటికే కిలో రూ.135-140కి చేరుకోగా, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పంట నష్టం వాటిల్లడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో కేంద్రం ముందుగానే అలర్ట్ అయ్యింది. గతేడాది ఇదే సమయంలో పప్పుధాన్యాలు 1.27 కోట్ల హెక్టార్లలో సాగవగా.. ఈ ఏడాది 1.18 కోట్ల హెక్టార్లకు తగ్గింది. దేశంలో ప్రధానమైన కంది పంట గతేడాది 47 లక్షల హెక్టార్లలో సాగవగా, ఈ ఏడాది 41 లక్షల హెక్టార్లకు తగ్గింది. జూలై మొదటి వారంలో జాతీయ సగటు పప్పుల ధర కిలో రూ.100 ఉండగా ప్రస్తుతం కిలో రూ.109కి చేరింది. మినుము, పెసర, కందిపప్పు ధరలు కూడా రూ.10 పెరిగాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వీటి ధరలు రూ.100 నుంచి రూ.115 వరకు ఉన్నాయి. ఢిల్లీలో కూడా కందిపప్పు ధర రూ.120 కు చేరింది.
అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి సబ్సిడీపై కందిపప్పు విక్రయాలను ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలు, పట్టణాల్లో రూ.135కే కిలో కందిపప్పు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు అన్నారు. ధరల నియంత్రణలో భాగంగా దేశీయ, విదేశీ మార్కెట్లలో పప్పుల లభ్యత, ధరలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యాపారుల వద్ద ఉన్న నిల్వలపై రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిఘా ఉంచాలని సూచించింది.