అమెజాన్‌లో భారీ మోసం..రూ.102 కోట్ల నష్టం
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సంస్థలో భారీ మోసం జరిగింది. హైదరాబాద్ గచ్చిబౌలి కేంద్రంగా ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నుండి ఈ స్కామ్ జరిగింది. ఇక్కడి ఉద్యోగులు, అమెరికాలో సరకులు సరఫరా చేసేవారితో కలిసి పన్నిన ఈ కుట్రతో రూ.102 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అమెజాన్ సంస్థ ఫిర్యాదు చేసింది. రిలే ఆపరేషన్ సెంటర్‌లో డెలివరీలో భాగంగా, గోదాము నుండి, సరకు వినియోగదారునికి అందజేసిన తర్వాత చెక్ అవుట్ వరకూ ఉండే ఈ ప్రక్రియలో ఈ మోసం జరిగింది. గతంలో ఇక్కడ పనిచేసి, మానేసినవారు ప్రస్తుత ఉద్యోగులు 18 మందిని ప్రలోభానికి గురిచేశారు. అమెరికాలో సరకుల డెలివరీకి వెళ్లకుండానే వెళ్లినట్లు నకిలీ ట్రిప్పులు నమోదు చేయించి, వినియోగదారులు లేరని చెపుతూ, రవాణా ఛార్జీల కింద రూ.102 కోట్లకు పైగా కొల్లగొట్టారు. ఈ విషయం అంతర్గత ఆడిట్‌లో బయటపడింది. దీనితో 18 మందిపై కేసులు నమోదు చేశారు.

