NationalNews

ఎంతిస్తారు? ఎంత ఖర్చు చేస్తారు? మీదే కులం?

Share with

◆ డబ్బు బలం ఉంటేనే రాజకీయ పార్టీల టికెట్లు ఖరారు
◆ నేటి సమాజంలో కేసులు లేని రాజకీయ నాయకులు అరుదు

ఒకప్పటి రాజకీయం వేరు నేటి రాజకీయం వేరు. మారిన పరిస్థితుల్లో అన్ని రంగాలతో పాటు రాజకీయ రంగం కూడా కలుషితం అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ముందు పెట్టుబడి తర్వాత రాబడి, మరలా తిరిగి పెట్టుబడి మళ్లీ రాబడి ఇలా రాజకీయం ఒక విష వలయంగా మారిపోయింది. దేశంలో ఆయా రాజకీయ పార్టీలు కూడా ప్రజాసేవ, వ్యక్తిగత ప్రవర్తన గత చరిత్ర లాంటివి పక్కనపెట్టి ఎంత ఖర్చు పెట్టుకుంటారు… పార్టీకి ఎంత ఇస్తారు? మీకున్న కుల బలం ఏమిటి? తదితరాలను పరిగణలోకి తీసుకొని వారికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయిస్తున్నాయి.

ప్రజాసేవ చేయాలనుకునేవారు గతంలో ఎంతో నీతి నియమబద్ధంగా క్రమశిక్షణతో ఉండి ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. తమ కార్యకలాపాలను ప్రతినిత్యం ఎన్నో కళ్ళు గమనిస్తుంటాయని భయం వారిలో ఎప్పుడు మెదులుతూనే ఉండేది. అందుకే అప్పట్లో రాజకీయాల్లో ప్రవేశించి మరింత ఎత్తుకు ఎదగాలనుకునేవారు. ప్రతి అడుగు ఎంతో ఆచితూచి వేసేవారు. పంచాయతీ సర్పంచ్ నుండి కేంద్ర మంత్రులుగా ఎదిగినవారు నిజాయితీ కలిగి నాయకులు ఎంతో మంది ఉన్నారు. కానీ నేడు ధన బలం రాజకీయ పార్టీలను శాసిస్తుంది. దాదాపు అన్ని పార్టీలు అదే బాటలో నడుస్తున్నాయి. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అధికార దాహంతో నైతిక విలువలు కూడా రాజకీయ పార్టీలు నేటి సమాజంలో తిలోదకాలు వదులుతున్నారు.

అధికార వాంఛతో చేయరాని పనులు కూడా చేస్తున్నారు. ఎన్ని చట్టాలు ఉన్నా ఎన్ని కోర్టులో ఉన్న ఎంత పకడ్బందీ ఏర్పాటు చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ రోజు రిగ్గింగులు దౌర్జన్యాలు యధావిధిగా జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల్లో కూడా విచ్చలవిడిగా డబ్బును వెదజల్లుతున్నారు. ఏ ఎలక్షన్ చూసిన డబ్బులు ఏరులై పారుతుంది. ప్రస్తుత ప్రజా ప్రతినిధులు 40 శాతం పైనే క్రిమినల్ కేసులు ఎదుర్కొనేవారు ఉన్నారటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏదేమైనా రాజకీయాలు ధనం ఉన్నవారికి సొత్తుగా మారిపోయాయి. నిజాయితీపరులు ప్రజలకు సేవ చేద్దామనుకునేవారు సామాన్య కార్యకర్తలు నేడు ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులే కొనసాగితే ప్రజాస్వామ్య ఉనికికే ప్రశ్నార్థకంగా మారవచ్చు. రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత పాటించవలసిన అవసరం నేటి సమాజంలో ఎంతైనా ఉంది.