పవర్ కోసం పాదయాత్రలు
పాదయాత్రలతో అధికారం సాధ్యమా ?
◆ ఏపీలో యాత్రలకు సిద్ధమవుతున్న పార్టీల అధినేతలు
◆ జులై 3 నుండి వరుసగా ఐదు ఆదివారాలు “జనవాణి” పేరుతో ప్రజల్లోకి జనసేన
ఏపీలో ఎన్నికల ఫీవర్ అప్పుడే మొదలైంది. దాంతో పాదయాత్రలు సైకిల్ యాత్రలు, బస్సు యాత్రలు అంటూ టీడీపీ,వైసీపీ, జనసేన ఫీలర్స్ వదులుతున్నారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏదో ఓ విధంగా ప్రజల్లోకి వెళ్లి తీరాల్సిందే.ఎందుకంటే బహిరంగ సభలు నిర్వహించి ఓట్లు ఆకర్షించాలని ప్రయత్నిస్తే కుదరదు.
అందుకే గతంలో ఎన్టీ రామారావు ఆరు పదుల వయసులోనూ చైతన్య రథాన్ని తయారుచేయించుకుని ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించారు.అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర కాంగ్రెస్ కు ఆక్సిజన్ గా మారి.. 2004లో అధికారంలోకి తీసుకువచ్చింది. వైఎస్ఆర్ బాటలో చాలా మంది నేతలు పాదయాత్రలు చేసి ఈ ఒరవడిని కొనసాగించారు.వైఎస్ఆర్ తర్వాత 2012-13 మధ్య టీడీపీ అదినేత చంద్రబాబు చేసిన వస్తున్నా మీకోసం యాత్ర.. బాబును నవ్యాంధ్రలో అధికారంలోకి వచ్చేలా చేసింది. అదేసమయంలో 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత ప్రస్తుత సీఎం జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర ఆయనను అధికారంలోకి తెచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి చంద్రబాబు ప్రజాయాత్రకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే.. వయసు రీత్యా ఆయన పాదయాత్ర కాకుండా.. బస్సు యాత్రకు సిద్ధమవుతారనే చర్చ టీడీపీలో సాగుతోంది. టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు..
ఇక జనసేన పార్టీ జూలై 3 నుండి వరుసగా ఐదు ఆదివారాలు పాటు జనవాణి పేరుతో ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించనున్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండి బాధిత పక్షాల నుండి నేరుగా అర్జీలు స్వీకరించనున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. అంతేకాక ఈ సంవత్సరం చివరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాదయాత్ర చేస్తారని ప్రచారం జరుగుతోంది.అయితే ఈ అంశంపై గతంలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు క్లారిటీ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయన పాదయాత్ర చేస్తే జనాలను కంట్రోల్ చేయడం కష్టంగా మారుతుందని.అందువల్ల పవన్ పాదయాత్ర చేయడం కష్టమేనని నాగబాబు అభిప్రాయపడ్డారు.
అయితే పవన్ పాదయాత్రకు ధీటుగా మరో యాత్రను తాము రెడీ చేస్తున్నామని నాగబాబు స్పష్టం చేశారు.దీంతో పవన్ ఇతర మార్గాల్లో యాత్ర చేయడానికి రెడీ అవుతున్నారని జనసైనికులు భావిస్తున్నారు. వీలైనంత వరకు పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.కానీ తాను బస్సుయాత్ర చేసినా ప్రజల్లో ఇంపాక్ట్ పెద్దగా రాదని.ఎన్టీఆర్ తరహాలో సొంతంగా ఒక రథాన్ని తయారు చేయించుకుని ఏపీలోని మొత్తం జిల్లాలలో పర్యటించాలని పవన్ మార్క్ ప్లాన్‌గా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.మొత్తానికి 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో బహుశా వచ్చే ఏడాది జూన్ తర్వాత పవన్ కళ్యాణ్ చైతన్య రథయాత్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ చైతన్య రథంలోనే బస చేసి పవన్ కళ్యాణ్ భోజనం, విశ్రాంతి లాంటి కార్యక్రమాలు చేపడతారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.చైతన్య రథయాత్ర ద్వారా రాష్ట్రమంతా తిరిగితే ఏపీ వ్యాప్తంగా జనాలను కదిలించగలమని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పార్టీల వ్యూహాలు ఫలిస్తాయా వీటికి జగన్ అడ్డుకట్ట వేస్తారా వేచి చూడాల్సి ఉంది.