బ్రహ్మాస్త్ర మూవీ ఎలా ఉందంటే…
అమితాబ్, షారుఖ్, నాగార్జున వంటి సీనియర్ సూపర్ స్టార్స్, రణబీర్, అలియా, మౌనిరాయ్ వంటి గ్లామరస్ స్టార్స్‌తో పెద్ద అంచనాల మధ్య నేడు విడుదలైంది బ్రహ్మాస్త్ర మూవీ. నిజానికి బాలీవుడ్‌కి ఈమధ్య హిట్స్ లేక గ్రహణం పట్టినట్లయ్యింది. ఈసారి ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ కొట్టాలని అయాన్ ముఖర్జీ పట్టుపట్టి తెరకెక్కించిన చిత్రమిది. జక్కన్న రాజమౌళి దీనిని స్వయంగా సమర్పించాడు. ఈ చిత్రం మూడు భాగాలుగా రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏవిధంగా ఆకట్టుకుందో చూద్దాం.

కథలోకి వెళ్తే సకల అస్త్రాలకు అధిదేవత బ్రహ్మాస్త్ర అని చెప్పబడుతుంది. ఈ బ్రహ్మాస్త్ర మూడు ముక్కలవుతుంది. వాటిలో ఒకటి సైంటిస్ట్ మోహన్ భార్గవ్(షారుఖ్ ఖాన్) దగ్గర, మరొకటి ఆర్టిస్ట్ అనీష్ శెట్టి (నాగార్జున) దగ్గర ఉంటుంది. మూడవ ముక్క ఎక్కడ ఉందో తెలియదు. ఈ బ్రహ్మాస్త్రను వశం చేసుకోవడానికి దేవ్ మనుషులు ప్రయత్నస్తుంటారు. వీరిలో మౌనిరాయ్ కూడా ఉంటుంది. ఆ ప్రయత్నాలను అడ్డుకునే క్రమంలో వరుణ అస్త్రం అయిన మోహన్ భార్గవ్, నంది అస్త్రం అయిన అనీష్ శెట్టి మరణిస్తారు. దేవ్ మనుషులను శివ ( రణబీర్ కపూర్) ఎలా అడ్డుకున్నాడు.? అతనికి ప్రియురాలు ఇషా( ఆలియాభట్ ) ఎలా సహాయం చేసింది?అనేదే కథాంశం. అగ్ని అస్త్రంగా తనను గుర్తించేందుకు శివ గురువు (అమితాబ్) ఏవిధంగా సహాయ పడ్డాడో వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కథాంశం దైవశక్తికి, దుష్టశక్తికి మధ్య యుద్ధం. సాధారణంగా ఈ యుద్ధంలో దైవశక్తిదే పైచేయి అవుతుంది. దర్శకుడు ఎంచుకున్న కథ బాగున్నా దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఫెయిల్ అయినట్లు అనిపిస్తోంది. ఒక్క VFX లో మాత్రం శ్రద్ధ పెట్టినట్లనిపిస్తోంది. ఇలాంటి కథల్లో సైడ్ ట్రాక్‌లు ఎక్కువ ఉండకూడదు. కానీ రణబీర్, ఆలియాల ప్రేమకథ వల్ల అసలు స్టోరీ చాలాసార్లు పక్కదారి పట్టినట్లనిపిస్తుంది. ఈ సినిమాలో రణబీర్ అగ్నిఅస్త్రం అని చెప్పారు. కానీ అగ్నిలో ఉండే పవర్ ఎక్కడా కనిపించదు. బ్రహ్మాస్త్ర గురించి సీరియస్‌నెస్ ఎక్కడా కనిపించదు. మంచి భోజనం పెట్టి మధ్యలో పళ్లెం లాగేసినట్లు మధ్యమధ్యలో లవ్ స్టోరీ, అసలు స్టోరీకి అడ్డంగా వస్తూంటుంది. షారుఖ్ ఖాన్ పాత్ర సినిమా మొదట్లో బాగుంటుంది. తర్వాత ఏంజరుగుతుందని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నప్పుడు మధ్యలో ప్రేమకథ చాలాసేపు జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఆస్టోరీ మరిచిపోతూంటారు. కనీసం ఇంటర్వెల్ తర్వాతయినా స్టోరీ స్పీడందుకుంటుందనుకుంటే మళ్లీ ప్రేమకథ వచ్చేస్తుంది.
నాగార్జున, అమితాబ్, మౌనిరాయ్‌ల నటన చాలా బాగుంటుంది. బ్రహ్మాస్త్ర మూడుముక్కలయినట్లు సినిమా కూడా మూడుముక్కలుగా ఉంటుంది. మొదట్లో షారుఖ్, తర్వాత నాగార్జున, చివర్న క్లైమాక్స్. ఇదే స్టోరీ దక్షిణాది దర్శకుల చేతిల్లో పెడితే ఫలితం మరో విధంగా ఉండేదేమో అనిపిస్తుంది. ఇలాంటి చిత్రాలకు ముగింపు చాలా ఆసక్తిగా ఉండాలి. తరువాత భాగంలో ఏం జరుగుతుందా అని అంచనాలు పెంచాలి. కానీ ముగింపుపై ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదనిపిస్తోంది.
నేపథ్యసంగీతం ఏమంత ఆకట్టుకోలేక పోయింది. కథనం సాగిన తీరు కూడా ఈ సినిమాకు బలహీనతగా చెప్పవచ్చు. ఈ సినిమాలో బలమైన విషయాలు ఏమైనా ఉన్నాయంటే నటీనటుల నటన, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, విజువల్ ఎఫెక్ట్స్‌ను చెప్పవచ్చు. పాటల్లో ఒక్కపాట మాత్రం కాస్త ఆకట్టుకుంటోంది.

