ఢిల్లీలో హై టెన్షన్… మరోసారి రైతుల ఆందోళనలు…
దేశంలో రైతులు మరోసారి ఆందోళనలకు రెడీ అయ్యారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన రైతులు ప్రస్తుతం నిరుద్యోగంపై పోరుబాట పట్టారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద `మహా పంచాయత్’కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘ బోర్డర్, టిక్రి బార్డర్‌తోపాటు యూపీ సరిహద్దులోని ఘాజీపూర్ సరిహద్దుల వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. సోమవారం ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి రైతులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీ బార్డర్‌లో అన్ని వాహనాలకు క్షుణ్ణంగా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. దేశ రాజధానిలో 144 సెక్షన్ విధించారు.

ఇప్పటికే రైతు నాయకుడు రాకేష్ టికాయత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇలాంటి అరెస్టుల వల్ల రైతులు వెనక్కి తగ్గరని టికాయత్ స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతను కలిసేందుకు తనను అనుమతించలేదని విమర్శించారు. ఆదివారం రోజున జంతర్ మంతర్ వద్ద నిరుద్యోగ సమస్యపై `రోజ్‌గార్ సంసద్’ నిర్వహించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు గోపాల్ రాయ్, సంజయ్ సింగ్, రైతు నాయకులు గుర్ణామ్ సింగ్ చదూనీ, రిషిపాల్ పలువురు నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. గతంలో కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది.


