NewsTelangana

బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి

తెలంగాణ  బీజేపీ  అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఐతే కొన్ని షరతులు విధించింది. భైంసాకు 3 కిలో మీటర్ల దూరంలోనే సభ ఉంటేనే అనుమతించాలని హైకోర్టు స్పష్టం చేసింది. భైంసా వెళ్లకుండా పాదయాత్ర కొనసాగించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. విద్వేషపూరిత వ్యాఖ్యలు, నినాదాలు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. బహిరంగసభను మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుపుకోవచ్చని పేర్కొంది.

బండి సంజయ్ పాదయాత్ర భైంసా పట్టణం వైపుగా వెళ్లడం లేదంటూ పిటిషనర్ తరపున సీనియర్ లాయర్ ఎన్ రామచంద్రరావు వాదనలు విన్పించారు. వై జంక్షన్ నుంచి మాత్రమే వెళ్తుందన్నారు. ఐతే పాదయాత్రకు భైంసాలో ఎందుకు అనుమతివ్వడం లేదని కోర్టు అడ్వొకేట్ జనరల్‌ను ప్రశ్నించింది. భైంసా ప్రాంతం చాలా సున్నితమైనదని.. శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అందుకే పోలీసులు అనుతివ్వలేదని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి.. సంజయ్ పాదయాత్రకు అనుమతించారు.