Telangana

తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టు ఝలక్

Share with

వీఆర్వోలను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర సర్కార్ జారీ చేసిన జీవో నంబర్​121 అమలును హైకోర్టు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.  అప్పటి వరకు ఉన్న గ్రామ పాలనా వ్యవస్ధలో అనేక మార్పులు తీసుకు వస్తూ 1980వ దశకంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్ధను ప్రవేశ పెట్టింది. అప్పటి నుండి గ్రామ పాలనా విభాగంలో విఆర్ఓలు కీలకంగా మారారు. రెండు మూడు దశాబ్దాల పాటు కొనసాగిన ఈ వ్యవస్ధను పూర్తిగా రద్దు చేస్తూ .. కొత్త రెవెన్యూ విధానానికి టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విఆర్ఓల వ్యవస్ధపై వచ్చిన ఆరోపణలు, విమర్శల నేపధ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి నిర్మూలనలో భాగంగానే వీఆర్ఓ వ్యవస్ధను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది కూడా. అయితే ప్రస్తుతం వీఆర్వోలుగా తెలంగాణ పరిధిలో వేలాది మంది విధులు నిర్వహిస్తున్నారు. వారందరినీ వివిధ ప్రభుత్వ శాఖలకు బదలాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం జీవో 121ని విడుదల చేసింది. ఈ జీవో ద్వారా వివిధ శాఖలలో ఆయా ఉద్యోగులను సద్దుబాటు చేసే ప్రక్రియను మొదలు పెట్టింది.

అయితే ఈ దీన్నివ్యతిరేకిస్తూ కొంతమంది ఉన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ చట్టప్రకారమే వీఆర్వోలను ఇతర శాఖలలో సర్థుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఐదు వేలమంది వీఆర్వోల్లో 56 మంది వేరే శాఖలలో చేరేందుకు అంగీకరించలేదని వెల్లడించారు. పిటీషినర్ తరపున న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ రెవెన్యూ శాఖలోనే వీఆర్వోలు కొనసాగాలని కోరుకుంటున్నారని తెలిపారు. వారి వాదనలు విన్న ధర్మాసనం ఎలాంటి విధివిధానాలు రూపొందించకుండా జీవోలు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకూ జీవో అమలును నిలిపివేయాలని వేరే శాఖల్లో బాధ్యతలు చేపట్టని వారిని రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని న్యాయస్ధానం ఆదేశించింది.