NewsTelangana

కేసీఆర్‌కు ముందు నొయ్యి.. వెనుక గొయ్యి

Share with

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అయితే, రాష్ట్రంలో రాజకీయాలు అప్పుడే వేడెక్కాయి. రాష్ట్రంలో ఎనిమిదేళ్ల పాటు ఎదురులేని ముఖ్యమంత్రిగా వెలుగొందిన కె.చంద్రశేఖర్‌రావు పరిస్థితి ఇప్పుడు ముందు నొయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా, మూడు నెలల్లో ఉప ఎన్నిక జరగనుందని వార్తలొస్తున్నాయి. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఫలితం టర్నింగ్‌ పాయింట్‌గా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ తమ ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానం అయినప్పటికీ ఈ సీటు టీఆర్‌ఎస్‌కు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. ముఖ్యంగా దుబ్బాక, హుజూరాబాద్‌లలో బీజేపీ తరఫున రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ విజయం తరువాత రాష్ట్రంలో ఆ పార్టీ వేగంగా విస్తరిస్తోందని, టీఆర్‌ఎస్‌ రోజు రోజుకు తగ్గుతోందని కాషాయ నేతలు ప్రచారం చేస్తున్నారు.

ఇటీవల వచ్చిన రెండు సర్వేల్లోనూ తెలంగాణాలో బీజేపీ బలం పుంజుకుందని, 30 నుంచి 40 శాతం వరకు ఓట్లు సాధిస్తుందని వెల్లడైంది. రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని తేలింది. ఈ పరిస్థితుల్లో మునుగోడులోనూ బీజేపీ గెలిస్తే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ తుడిచిపెట్టుకుపోయిందని ఆ పార్టీ నేతలు ప్రచారాన్ని ఉధృతం చేస్తారన్న భయం కేసీఆర్‌కు పట్టుకుంది. అందుకే మొన్నటి వరకు మోదీ సర్కారుతో అంటకాగిన కేసీఆర్‌ ఇప్పుడు కేంద్రంపై సమరశంఖం పూరించారు. ఇటీవల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫు అభ్యర్థులకు మద్దతు పలికిన కేసీఆర్‌ తాజాగా నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించి కేంద్రంపై ధిక్కార స్వరాన్ని వినిపించారు. అదే సందర్భంలో విభజన రాజకీయాలతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ బీజేపీపై విరుచుకుపడుతున్నారు. జాతిపిత మహాత్మాగాంధీని సైతం మోదీ సర్కారు అవమానిస్తోందని, స్వాతంత్ర్య పోరాటానికి నేతృత్వం వహించిన తమ దేశ హీరోను గుర్తించకపోవడం ఏ దేశంలోనూ లేదంటూ కేసీఆర్‌ తూర్పారబట్టారు.

గులాబీ నేతల్లో ఈడీ, సీబీఐల భయం


మరోవైపు గత ఎనిమిదేళ్లుగా వివిధ సంక్షేమ పథకాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని విపక్ష నేతలు కోడై కూస్తున్నారు. ఇదే అదనుగా మోదీ సర్కారు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులపై ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తే తమ అక్రమాల బండారం బయట పడుతుందని, తెలంగాణాలో తమ నావ మునిగిపోవడం ఖాయమని కేసీఆర్‌ భయపడుతున్నారు. అందుకే టీఆర్‌ఎస్‌కు మునుగోడు జీవన్మరణ సమస్యగా మారింది. కాంగ్రెస్‌కు కంచుకోట అయిన మునుగోడులో గులాబీ జెండాను ఎగురవేసి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమనే సంకేతాలను తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్‌ గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే, దేశ రాజకీయాలనే తన గుప్పిట్లో బిగుస్తున్న బీజేపీ తెలంగాణాలోనూ వేగంగా పావులు కదుపుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండాను ఎగురవేయాలని కంకణం కట్టుకున్న మోదీ-షాల ద్వయం దానికి అనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణాలో ఏ చిన్న అవకాశం దొరికినా పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ బహిష్కరించడంతో కాషాయ కండువా కప్పుకున్న తెలంగాణ ఉద్యమ నేత ఈటల రాజేందర్‌కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తూ.. టీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులను బీజేపీ వైపు ఆకర్షించేట్లు చేస్తున్నారు. అదే సందర్భంలో అధికారానికి చాలా కాలంగా దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీలోనూ రేవంత్‌రెడ్డిపై కోపంతో రగిలిపోతున్న నాయకులకు కాషాయ కండువా కప్పుతున్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు చెందిన కీలక నాయకులను కాషాయ దళంలో చేర్చుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు రాబట్టాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

దిక్కుతోచని స్థితిలో రేవంత్‌రెడ్డి


ఇదిలా ఉండగా ఎనిమిదేళ్ల నుంచి తెలంగాణాలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ను ఈసారి ఎలాగైనా విజయ తీరాలకు చేర్చాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పట్టుదలతో ఉన్నారు. అయితే, పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు ఒక్కొక్కరే కాంగ్రెస్‌ను వీడుతుండటంతో రేవంత్‌రెడ్డి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. రేవంత్‌పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒంటికాలిమీద లేస్తున్నారు. మధుయాష్కీ గౌడ్‌ కూడా రెడ్డి వ్యాఖ్యలపై రేవంత్‌కు బహిరంగ లేఖ రాసి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. మరో సీనియర్‌ నాయకుడు వి.హనుమంతరావు పార్టీలో నిత్య అసంతృప్త నేతగా గుర్తింపు పొందారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు పట్టుగొమ్మ అయిన మునుగోడును వదులుకోక తప్పదేమోననే భయం పార్టీకి పట్టుకుంది. అదే జరిగితే కాంగ్రెస్‌ అధిష్ఠానం వద్ద ఆయన ప్రతిష్ఠ తగ్గుతుంది. రాష్ట్రంలో అధికారం దేవుడెరుగు.. కాంగ్రెస్‌ ఉనికిని కాపాడుకోవడమెలాగో తెలియక పార్టీ సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు.