Breaking NewsHome Page Sliderhome page sliderNewsNews AlertTelanganatelangana,viral

తెలంగాణ లో భారీ వర్షాలు… అధికారులను హెచ్చరించిన సీఎం

తెలంగాణ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.శుక్రవారం కురిసిన భారీ వర్షాల ప్రభావంతో హైదరాబాద్ నగరంలో జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు, కూడళ్లన్నీ చెరువులను తలపించేలా నీటితో నిండిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం, మోకాలి లోతు వరద నీరు, చెట్లు విరిగిపడటం వంటి అనేక సమస్యలు ఎదురయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో పలు ప్రాంతాలు చీకటిలో మునిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు మెట్రో స్టేషన్లు, ఫ్లైఓవర్ల కింద, పెట్రోల్ బంకుల వద్ద తలదాచుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. రోడ్లపై ప్రయాణం కష్టమవడంతో చాలామంది ఉద్యోగులు, ప్రయాణికులు మళ్లీ ఇంటికి చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) కీలక హెచ్చరికను జారీ చేసింది. రాబోయే 72 గంటలపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లో ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. వర్షాల తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే విధంగా సిబ్బంది అందుబాటులో ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు, చెట్లు కూలిన ప్రాంతాల్లో తక్షణమే స్పందించాల్సిందిగా తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వచ్చినా వెంటనే మరమ్మతులు చేయాలని, వరద నీరు నిలిచిపోకుండా తొలగించే చర్యలు చేపట్టాలని సూచించారు.