News AlertTelangana

తెలంగాణా జలప్రాజెక్టులకు జలకళ -ఎగువనుండి భారీగా వరదనీరు

Share with

భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లోకి జలకళ సంతరించుకుంది. ఉత్తర తెలంగాణా  వర ప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో

అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇక సాగు నీటికి ఢోకా ఉండబోదు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్

      ప్రాజెక్ట్ క్యాచ్ మెంట్ ఏరియాతో పాటు ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 4,92,415 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 57 టీఎంసీలుగా ఉంది, పూర్తి స్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు. కేవలం 48 గంటల వ్యవధిలోనే 27 టీఎంసీల వరద వచ్చి చేరింది. గంట గంటకు వరద ఉధృతి పెరిగిపోతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా… ప్రస్తుతం 1081 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి  సామర్థ్యం 90 టీఎంసీలు. కాగా, ప్రస్తుతం సగానికి పైగా టీఎంసీల నీరు ఉంది. భారీ వరద వస్తుండటంతో కందకుర్తి వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. 3 నదుల త్రివేణి సంగమం కందకుర్తి వద్ద ప్రమాదకరంగా గోదావరి ప్రవహిస్తోంది. కందకుర్తి వద్ద పురాతన శివాలయం పూర్తిగా నీట మునిగింది. ఉమ్మడి జిల్లాలో చిన్నతరహా ప్రాజెక్టులు పోచారం, సింగీతం, కళ్యాణి ప్రాజెక్టులు పూర్తిస్థాయికి చేరాయి. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు జలకళను సంతరించుకున్నాయి.

కల్యాణి ప్రాజెక్ట్

కల్యాణి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. కల్యాణి ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేశారు.  ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్ట్ లోకి భారీ స్థాయిలో ఇన్‌ప్లో వస్తుండడంతో అదే మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఎగువ ప్రాంతం నుండి ప్రాజెక్ట్ లోకి వస్తున్న 331 క్యూసెక్కుల వరద నీటిని ప్రాజెక్ట్ రెండు వరద గేట్లను ఎత్తి దిగువ మంజీర నదిలోకి అంతే మొత్తంలో నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి మట్టం 409.50 మీటర్లు ఉండగా ప్రస్తుతం 409.10 మీటర్ల కు నీటి మట్టానికి చేరుకుంది.

కౌలస్ నాలా ప్రాజెక్ట్

జుక్కల్ మండలం కౌలస్ నాలా ప్రాజెక్ట్ 2గేట్లను ఎత్తి 1096క్యూసెక్కుల నీటిని దిగువన కౌలస్ వాగు ద్వారా మంజీరా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 458 మీటర్లకు గాను ప్రస్తుతం 457.60 మీటర్లు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుండి 1,828 ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. అధికారులు ఎప్పటికప్పుడూ నీటి మట్టాన్నిపరిశీలించి గేట్లు ఎత్తుతూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

కిన్నెరసాని ప్రాజెక్ట్

 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఎడతెరిపిలేని వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా గత రెండు రోజులుగా వర్షం కురుస్తుండటంతో చాలా చోట్ల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధానంగా కిన్నెరసాని డ్యామ్‌లో 4 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 407 అడుగులు ఉండగా ఇప్పటికే 403 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. 24 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో గేట్టు ఎత్తి 21 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు ఎత్తి వేయడంతో వరద నీటిని చూసేందుకు పర్యాటకుల సందడి మొదలైంది.  మరోవైపు ఖమ్మం జిల్లాలోని పల్లిపాడు సమీపంలో వాగు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది.

భద్రాద్రి జిల్లాలో తాలిపేరు ప్రాజెక్టు-

భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు సంబందించిన 16 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 17వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో నీటి మట్టం పెరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం వద్ద 1.20 నిమషాలకు వరదఉధృతి 52అడుగులకు చేరింది. అధికారులు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేసారు. వరదల కారణంగా భద్రాద్రి జిల్లాలోని రాజాపురం  యానంబైలు వద్ద చప్టాపై నీరు వస్తుండటంతో 30 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇంకా పాలేరు,వైరా,చర్ల, కిన్నెరసాని జలాశయాలకు వరదఉధృతి కొనసాగుతోంది. జిల్లామంత్రి, కలెక్టర్, ఎస్‌పిలు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

Read :సినిమాలే ముద్దు… రాజకీయాలే వద్దు