వేసవిలో ‘కడుపు చల్లగా’…
శివరాత్రి ఇలా వెళ్లిందో లేదో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు క్రమంగా ముదురుతున్నాయి. ఈ వేసవిలో ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి అనే విషయాలపై అవగాహన ఉంటే ఆరోగ్యం చక్కగా ఉంటుందని సెలవిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

వేసవిలో అందరూ ఎదురుచూసే మామిడికాయ పచ్చళ్లు, మామిడిపళ్లు తగిన మోతాదులో తీసుకోవడం మంచిదే. కానీ మితిమీరి ఆవకాయలు, మాగాయలు, మామిడిపళ్లు తీసుకుంటే అజీర్తి, రక్తపోటు, మధుమేహం వంటివి పెరిగే అవకాశం ఉంది. మామిడి పళ్లలో ఉండే చక్కెరల కారణంగా బరువు పెరిగే అవకాశం ఉంది. ఊరగాయలలో ఉప్పు ఎక్కువగా వేయాల్సి వస్తుంది. ఈ కారణంగా ఇవి కూడా ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ఇంకా మసాలాలు, వేపుళ్లు, జంక్ ఫుడ్స్, ఛాట్స్ వంటి వాటికి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటివల్ల శరీరంలో వేడి ఎక్కువవుతుంది.

వేసవిలో మరొక ఆకర్షణ కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్. ఎండలో బయటకు వెళ్లినప్పుడు వేసవితాపానికి తట్టుకోలేక ఉపశమనం కోసం ఇవి తీసుకుంటారు. కానీ వీటివల్ల అంతర్గత వేడి ఎక్కువవుతుంది.

వేసవిలో విరివిగా దొరికే పుచ్చకాయలు, కొబ్బరిబోండాలు,చెరకు రసాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగు, మజ్జిగలు కూడా శరీరానికి ఎంతో చలువ చేస్తాయి. తాజా పండ్లు, కూరగాయలు కూడా వేసవి తాపాన్ని తగ్గిస్తాయి. సలాడ్‌లు, ఆకుకూరలు, కీరదోసలు తినడం వల్ల శరీరం ఎండలకి కందిపోకుండా తాజాగా ఉండేలా చేస్తాయి. అలాగే శరీరానికి తగిన వ్యాయామం, నడక కూడా మేలు చేస్తాయి. నీరు బాగా తీసుకోవడం ద్వారా ఎండదెబ్బకు గురికాకుండా ఉంటారు.

