తెలంగాణాలో రానున్న రెండురోజుల్లో వడగళ్ల వర్షాలు
తెలంగాణా ప్రజలకు వాతావరణశాఖ మళ్ళీ పిడుగులాంటి వార్తను చెప్పింది. రానున్న రెండు రోజుల్లో మరోసారి వడగళ్ల వర్షాలు రాష్ట్రంలో బీభత్సం సృష్టించనున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా రాష్ట్రంలో ఇప్పటికే కురిసిన వడగళ్లతో కూడిన భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే మరోసారి వాతావరణశాఖ నుంచి ఈ హెచ్చరికలు జారీ అవడంతో తెలంగాణా వ్యాప్తంగా ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వడగళ్ల వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలంతా ఈ రెండురోజులపాటు తగు జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు రావొద్దని వాతావరణశాఖ హెచ్చరించింది.

