BusinessHome Page SliderNationalNews Alert

అక్టోబరులో జీఎస్టీ ఆదాయం రూ. 1.96 లక్షల కోట్లు

ఇంటర్నెట్ డెస్క్ : అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు అదరగొట్టాయి. ఈ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అక్టోబర్ లో దసరా, దీపావళి పండుగ సీజన్ కారణంగా ఏకంగా రూ.1.96 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం సమకూరింది. గత ఏడాది అక్టోబర్ కన్నా ఇది 4.6 శాతం ఎక్కువని చెప్పారు. సెప్టెంబరు 22న మొదలైన జీఎస్టీ సంస్కరణల తర్వాత పండగ సీజన్‌లో వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్ కనిపించిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించడం వల్లే ఇది సాధ్యమైందని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఏడాది వినియోగం మరో 10 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల అదనంగా రూ. 20 లక్షల కోట్ల మేర కొనుగోళ్లు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో కూడా మంచి వృద్ధి కనిపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబరు 12 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 6.33 శాతం పెరిగి రూ. 11.89 లక్షల కోట్లకు చేరాయి. కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ. 5.02 లక్షల కోట్లకు, వ్యక్తిగత పన్ను వసూళ్లు రూ. 6.56 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. బలమైన డిమాండ్, మంచి పన్ను విధానం, పెరిగిన వినియోగం వంటి కారణాల వల్లే జీఎస్టీ వసూళ్లు దూసుకుపోతున్నాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.