InternationalNews

100 వ పుట్టిన రోజున.. బామ్మ వింత కోరిక

ప్రపంచంలో చాలా మందికి పుట్టినరోజు గురించి రకరకాల కోరికలు వుంటాయి.  కొంతమంది పుట్టినరోజు నాడు ప్రపంచంలోని అద్భుత ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటారు. ఇంకొంతమంది రకరకాల వంటలు తినాలని,కుటుంబ సభ్యులు ,స్నేహితులతో సంతోషంగా గడపాలని కోరుకుంటారు. ఇక వృద్దుల విషయానికొస్తే వారు తమ మనవళ్లు ,మనవరాళ్లను చూడాలని కోరుకుంటూ ఉంటారు.  అయితే ఒక బామ్మ మాత్రం ఇందుకు భిన్నంగా కోరికుని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆమె పేరు జీన్ బికెంటన్ ఈమె ఆస్ట్రేలియాకు చెందిన వందేళ్ళ బామ్మగారు. కొన్నేళ్లుగా ఈ బామ్మ వీల్‌చైర్‌కే పరిమితమైంది. ఇటీవల తన 100 వ పుట్టినరోజు వేడుకను కుటుంబసభ్యులతో కలిసి ఉత్సాహంగా జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో సడెన్‌గా పోలీసులు అక్కడికి వచ్చారు. అంతేకాకుండా అందరూ చుస్తుండగానే ఈ బామ్మను అరెస్టు చేసి..సంకెళ్ళు వేసి మరీ తీసుకెళ్లారు. ఇటువంటి సమయంలో షాక్ అవ్వాల్సిన బామ్మగారు చప్పట్లు కొడుతూ..సంతోషపడ్డారు. దీనికి తోడు ఆ వేడుకల్లో పాల్గొన్న వారంతా ఆమెకి మద్దతు పలికారు. ఇదంతా ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా? ఏమిలేదండి ఈ అరెస్టు అంతా ఉత్తిత్తిగానే జరిగింది. అసలు దీని సంగతేంటో ఒక్కసారి చూద్దాం.

ఈ బామ్మకు తన జీవితకాలంలో ఒక్కసారైన అరెస్టు అవ్వాలనేది తన చిరకాల వాంఛ. ఈ విచిత్రమైన కోరికను విక్టోరియా పోలీసులు ఈ విధంగా తీర్చారు. పైగా బామ్మ 100వ  పుట్టిన రోజు నాడే తన కోరికను తీర్చి ఆమెను మరింత సంతోషపరిచారు. అనంతరం పోలీసులు బామ్మతో కలిసి ఫోటోలు దిగి సందడి చేశారు.  ఈ మేరకు విక్టోరియా పోలీసుశాఖ వాటిని తమ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

అరెస్ట్ అయితే ఎలావుంటుందో చూడాలన్నది బామ్మగారి చివరి కోరిక అని తెలియడంతో ఆ కోరికను ఇలా తీర్చామనన్నారు. దీంతో బామ్మగారు చాలా సంతోషపడ్డారని ,ఇది మాకు సరదాగానే అనిపించిందన్నారు. ఈ ఎపిసోడ్ అంతా కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.  పోలీసుల స్పందన వారి మనసుకు హత్తుకుంది. దీంతో నెటిజన్లు ఇది కమ్యూనిటీ పోలిసింగ్‌కు అద్దం పట్టినట్లుంద్ననారు. పుట్టినరోజు నాడు బామ్మకు గొప్ప కానుక ఇచ్చారంటూ వారు పోలీసులపై ప్రసంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ బామ్మ గురించి వివరాల్లోకి వెళితే ఆమె సుదీర్ఘకాలం ఆర్మీలో నర్సుగా పనిచేసి రిటైరయ్యారు. ఈ విధంగా ఆమె తన చిరకాల వాంఛను తీర్చుకున్నారు.