మందుబాబులకు శుభవార్త
తెలంగాణలో నూతన సంవత్సర వేడుకల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. డిసెంబర్ 31వ తేదీన వేడుకలు జరుపుకునేందుకు వీలుగా మద్యం విక్రయాల సమయాన్ని పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ కీలక మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం, డిసెంబర్ 31 రాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు తెరిచి ఉంచుకోవచ్చు. అలాగే, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బులు, ఇతర న్యూ ఇయర్ ఈవెంట్లకు రాత్రి ఒంటి గంట వరకు అనుమతి ఇచ్చారు. మద్యం ప్రియులకు ఈ నిర్ణయం ఊరటనిచ్చినప్పటికీ, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు కఠిన నిబంధనలను అమలు చేయనున్నారు.నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో కలిసి పబ్బులు, బార్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. డ్రగ్స్ తీసుకున్న వారిని నిమిషాల్లో గుర్తించే అత్యాధునిక పరికరాలను వినియోగిస్తున్నారు. అలాగే, డ్రగ్స్ ఛాయలను పసిగట్టడానికి ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు ఉంటాయని, వేడుకలకు వెళ్లేవారు ముందుగానే డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

