గుడ్ న్యూస్.. రేపు ఈ-గరుడ బస్సులు ప్రారంభం
హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త అందించింది టీఎస్‌ఆర్టీసీ. పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వి.సి. సజ్జనార్ ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. హైదరాబాద్ – విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. వాటిలో 10 బస్సులను ఈ నెల 16 తేదీ నుండి వాడకంలోకి తెస్తోంది. అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, హైటెక్ హంగులతో అందుబాటులోకి తెస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులకు ‘ఈ-గరుడ’ సంస్థ నామకరణం చేసింది. హైదరాబాద్ మియాపూర్ క్రాస్ రోడ్స్ సమీపంలోని పుష్పక్ బస్ పాయింట్ వద్ద మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ బస్సులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సంస్థ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి ఈ-గరుడ బస్సులను ప్రారంభిస్తారని వి.సి. సజ్జనార్ తెలిపారు.

