గోదావరికి మళ్లీ వరద?: అంబటి
గోదావరి నదికి మళ్లీ వరద వచ్చే ప్రమాదం నెలకొందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పోలవరం, ధవళేశ్వరం వద్ద 10 లక్షల క్యూసెక్కుల నీరు చేరిందని చెప్పారు. అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. నాగార్జున సాగర్ కూడా నిండుతోందని, కృష్ణా నదికి కూడా వరద తాకిడి ఉండే ప్రమీతవ ఉందని హెచ్చరించారు. పైనుంచి వచ్చే ప్రతి నీటి బొట్టు కిందికి వచ్చే అవకాశం ఉందన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఓబుళాపురం మైనింగ్‌పై టీడీపీ మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని అంబటి ఆరోపించారు. అక్కడ వివాదం చాలా కాలంగా ఉందని, ఎవరైనా సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టబడాల్సిందేనని స్పష్టం చేశారు. పోలవరాన్ని 2018లోనే పూర్తి చేస్తానన్న చంద్రబాబు నాయుడు కాళ్లు, చేతులు పైకి ఎత్తేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు నాడు లోయర్, అప్పర్ కాఫర్ డ్యాంను పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్‌ను కట్టే ప్రయత్నం ఎందుకు చేశారని ప్రశ్నించారు. రామోజీ రావు వియ్యంకుడికి చెందిన నవయుగను తొలగించి మెగా వాళ్లకు ఆ పనిని తక్కువ ధరకు అప్పగించడం చంద్రబాబుకు కడుపు మంటగా ఉందన్నారు. పోలవరం విషయంలో కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టి భారీ నష్టానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నష్టం ఎంతమేరకు జరిగిందో విచారణ జరుపుతున్నామని తెలిపారు.