బీజేపీ నాయకుల ఓవర్ యాక్షన్: జగ్గారెడ్డి
బీజేపీ నాయకులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. గాంధీ కుటుంబాన్ని విమర్శించే స్థాయి బీజేపీకి లేదన్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఏఐసీసీ పిలుపుతో జగ్గారెడ్డి చేపట్టిన ఆజాదీ కా గౌరవ యాత్ర రెండో రోజుకు చేరుకుంది. బుధవారం యాత్ర సదాశివపేట మీదుగా పెద్దాపూర్‌కు చేరింది. ఈ సదర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఏనాడూ పనిచేయలేదని స్పష్టం చేశారు. అధికారం కాంగ్రెస్‌కు కొత్త కాదని, బీజేపీ నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు మానుకోవాలని హితవు చెప్పారు. దేశానికి స్వాంతంత్ర్యం తీసుకొచ్చిన కుటుంబాన్ని మోదీ సర్కారు రాజకీయ కక్ష సాధింపులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం కోసం ఏర్పాటు చేసిన పత్రికకు సంబంధించి చిల్లర కారణాలతో కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఆస్తులను, జీవితాన్ని త్యాగం చేసిన విషయం ఇప్పటి పాలకులకు తెలియదన్నారు. కాంగ్రెస్ పాలించే రోజుల్లో మోదీ, కేసీఆర్, హరీశ్‌రావు, బండి సంజయ్ పుట్టనే లేదన్నారు. బండి సంజయ్‌కు ఏమీ తెలిదని, ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు ఇచ్చే స్క్రిప్ట్‌ను టీవీల ముందు వల్లె వేస్తాడని ఎద్దేవా చేశారు. గాంధీ ఫలాలను బీజేపీ నాయకులు అనుభవిస్తున్నారని విమర్శించారు.