Andhra PradeshNewsTelangana

రెండు రాష్ట్రాలు వరద రగడ… బొత్స వర్సెస్ పువ్వాడ

Share with

ఏపీ, తెలంగాణ మధ్య మరో కొత్త వివాదం తలెత్తింది. గోదావరి నదికి తాజాగా వచ్చిన వరదల కారణంగా భద్రాచలంతో పాటు ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు, అలాగే ఏపీలో విలీనమైన పోలవరం మండలాలు కూడా మునిగిపోయాయి.దీంతో ఇంత ముంపుకు పోలవరం ప్రాజెక్టే కారణమంటూ తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు మొదలుపెట్టారు. దీనికి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు

గోదావరి నదికి తాజాగా భారీ ఎత్తున వచ్చిన వరద ఇరు తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ పరిధిలోకి వచ్చే ఖమ్మం జిల్లాపై ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీలో విలీనమైన గ్రామాల్లోనూ వరద ప్రభావం తీవ్రంగా ఉంది.దీంతో ఈ వరద కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పోలవరంపై పువ్వాడ విమర్శలు
తాజాగా వచ్చిన గోదావరి వరదలకు పోలవరం ప్రాజెక్టే కారణమంటూ తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు ఎక్కుపెట్టారు.పోలవరం వల్ల భద్రాచలానికి ముంపు పొంచి ఉందని, దీనిపై శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీలో విలీనమైన 7 మండలాలు,ఆ పక్కనే ఉన్న ఐదుగ్రామాలు వెంటనే తెలంగాణలో కలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని పువ్వాడ డిమాండ్ చేశారు. ఇందుకోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలని కోరారు. గతంలో చాలా సార్లు పోలవరం ఎత్తు తగ్గించమని తాము కోరిన విషయాన్ని పువ్వాడ అజయ్ గుర్తుచేశారు.

పువ్వాడకు బొత్స కౌంటర్
పువ్వాడ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. పోలవరం ఎత్తు ఎవరు పెంచారని ప్రశ్నించారు.డిజైన్ల ప్రకారమే పోలవరం నిర్మాణం జరుగుతోందని, దాన్ని ఎవరూ మార్చలేదన్నారు. భద్రాచలం ముంపు ఉంటుందని ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రస్తావించిన అంశంమేనన్నారు. విభజన చట్ట ప్రకారమే అంతా జరుగుతోందని బొత్స తెలిపారు. వందేళ్ల తర్వాత మొదటిసారి ఈ నెలలో గోదావరికి ఇంత పెద్దఎత్తున వరద వచ్చిందని ఆయన గుర్తుచేశారు.

హైదరాబాద్ ను ఏపీలో కలిపేస్తారా ?
రాష్ట్రవిభజన వల్ల హైదరాబాద్ ఆదాయాన్ని ఏపీ కోల్పోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. హైదరాబాద్ ను ఏపీలో కలిపేయమని అడగగలమా అని ఆయన ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు కలిపేస్తే ఎవరికీ ఇబ్బంది లేదు కదా అన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదని పువ్వాడకు బొత్స హితవు పలికారు. సమస్యల పరిష్కారమే ఇప్పుడు ముఖ్యమన్నారు. కొందరు వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాల్సి ఉందన్నారు.సీఎం అయినా, మంత్రులైనా బాధ్యతగానే మాట్లాడాలన్నారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం సరికాదన్నారు. పువ్వాడ అజయ్ అయన సంగతి ఆయన చూసుకోవాలని, ముంపు మండలాల బాధ్యత ఏపీ ప్రభుత్వానిదేనన్నారు. ఖమ్మం జిల్లాలో ముంపు ప్రాంతాల సంగతి ఆయన చూసుకుంటే సరి పోతుందన్నారు.