పేదల దేవుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ
పట్టుదల .. లక్ష్యశుద్ది.. చిత్తశుద్ధి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా .. ఎన్ని బాధలు మెలిపెట్టినా .. ఎన్ని రకాల కష్టాలు ఒక్కసారిగా ఎగసిపడినా.. చెదరని ధైర్యం ఉంటే ముందడుగే పడుతుంది. నిబద్ధత .. కార్యదక్షత.. చేసే పని మీద ఏకాగ్రత ఉంటే వెనుతిరిగి చూసే పనే ఉండదు. అవే విజయాన్ని సాధించి పెడతాయి. ఉన్నత దిశగా తీసుకు వెళతాయి. అలాంటి భావాలు కలిగిన జాతీయవాదుల్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రముఖులు. జనసంఘ్‌ను పరుగులు పెట్టిన వారిలో దీన్ దయాళ్ ఉపాధ్యాయది ప్రత్యేక స్థానం. పాశ్చాత్య భావనలపై ఎట్టి పరిస్ధితుల్లోనూ ఆధారపడకూడదని తలచారు. పేదలకు జీవించే హక్కు ఇవ్వాలని గట్టిగా పోరాడిన జాతీయ ఉద్యమకారుడు. పేదలకు బతుకునివ్వాలంటే వారికి కావాల్సిన కూడు, గూడు, గుడ్డ గురించి పరితపించిన మహనీయుడు దీన్ దయాళ్.

కాంగ్రెస్ విధానాలతో విభేదించారు. దీన్ దయాళ్ సాధించిన విజయాలు ఎన్నో. చైతన్య పరిచిన కార్యక్రమాలు మరెన్నో. భావి తరానికి బాటలు వేసిన రాజకీయ సిద్ధాంత కర్తగా ఆయన చిరస్మరణీయులు. కొందరు మరణించే వరకు మాత్రమే జీవిస్తారు. కానీ .. ఆయన మాత్రం మరణించిన తర్వాత కూడా జీవించే ఉన్నారు. జనసంఘ్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ పని చేశారు. పార్టీని ఏర్పాటు చేసిన కేవలం మూడు నెలలకే ఓ రికార్డుని నెలకొల్పారు. జనామోదంతో .. జనా కర్షణతో 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకటిగా జనసంఘ్ నాడు ఎన్నికల సంఘం గుర్తింపు పొందింది. అంటే ఆ ఘనత ముమ్మాటికీ దీన్ దయాళ్‌దే. సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ప్రజాదరణ ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీన్ దయాళ్ సమన్వయ కౌశలంతో జనసంఘ్ ఓ చైతన్య తరంగమై ఎదిగింది.

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ భారత రాజకీయ చరిత్రలో ప్రముఖ వ్యక్తులలో ఒకరు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 25ని అంత్యోదయ దివస్‌గా కేంద్రం జరుపుతోంది. అంత్యోదయ అనేది ఉపాధ్యాయచే అభివృద్ధి చేయబడిన ఒక భావన అని.. చివరి వ్యక్తి కూడా ప్రయోజకుడు కావాలన్నదే ఈ సిద్ధాంతం. అంత్యోదయ సమగ్ర మానవతావాద తత్వశాస్త్రంపై ఆధారపడిన భావన. ఇది దీన్దయాళ్ ఉపాధ్యాయ్ చేత సృష్టించబడనప్పటికీ, దాని ప్రజాదరణ విస్తరణ అనన్యసామాన్యమైనది.

స్వాతంత్ర్యం సమయంలో, ఆ తర్వాత భారతదేశంలో కొనసాగుతున్న పేదరికాన్ని లక్ష్యంగా చేసుకోవాలని ఆయన అంత్యోదయ అవసరాన్ని నొక్కి చెప్పారు. భారతదేశాన్ని పాలించే పార్టీకి సైద్ధాంతిక నాయకులు, నైతిక స్ఫూర్తినిచ్చిన వారిలో ఉపాధ్యాయ్ ఒకరు. బీజేపీ ఆవిర్భావం నుంచి ఆయన భావనలు బీజేపీకి వెన్నుదన్నుగా పనిచేశాయి. భారతీయ జనసంఘ్ అభివృద్ధికి ఉపాధ్యాయ చేసిన కృషిని హైలైట్ చేయడానికి, ఆ తర్వాత సెప్టెంబర్ 25… ఆయన జన్మించిన రోజును అంత్యోదయ దివస్‌గా నిర్వహిస్తున్నారు.
సమగ్ర మానవతావాదానికి నిలువెత్తు నిదర్శనం దీనదయాళ్ ఉపాధ్యాయని కీర్తించారు ప్రధాని నరేంద్రమోదీ. అత్యంత అణగారిన వారిని ఉద్ధరించడం కోసం జీవితమంతా పాడుపడ్డారన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఆయన సూచనలు ఆదర్శమయ్యాయన్నారు. అంత్యోదయపై ఆయన చూపిన ప్రాధాన్యత పేదలకు సేవ చేయడం మాకు స్ఫూర్తినిస్తూనే ఉందన్నారు మోదీ. ఆయన అసాధారణమైన ఆలోచనాపరుడని… మేధావిగా కూడా విస్తృతంగా స్మరించబడ్డారని కీర్తించారు.

