రోడ్డులేని గ్రామంలో వెతుక్కుంటూ వెళ్లి అడవి బిడ్డలకు సేవ..!
మామడ: దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉన్న మారుమూల గ్రామాలవి. రహదారి సౌకర్యం లేని ఆ ఊళ్లకు కొండకోనలు, వాగులు వంకలు దాటుకుంటూ వెళ్లి సాయం అందించి దాతృత్వాన్ని చాటుకుంది నిర్మల్‌కు చెందిన డాక్టర్ అప్పాల కావేరి ఫౌండేషన్. పెంబి, మామడ మండలాల్లోని బుర్కలేగి, మల్కపల్లి, రచ్చకోట గ్రామాల్లో దివంగత అప్పాల కావేరీ జయంతి సందర్భంగా ఆదివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సరకులు తీసుకుని బుర్కలేగి వెళ్లేందుకు ఫౌండేషన్ సభ్యులు అడవిలో నుండి ట్రాక్టర్ల ద్వారా ఆరు కి.మీ. సాహస యాత్ర చేశారు. మొత్తం మూడు గ్రామాల్లో బ్లాంకెట్లు, స్వెట్టర్లు, పిల్లలకు దుస్తులు, అవసరమున్న వారికి ట్రై సైకిళ్లను అందజేశారు. జ్వరాలున్నవారికి వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అడవిలో ఉన్న మాగురించి పట్టించుకుని వచ్చి మాకు సహాయం చేసినందుకు గోండులు మురిసిపోయారు.

