అక్టోబర్ 1 నుండి నాలుగో విడత వారాహి యాత్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో ఇప్పటికే మూడు విడుదలగా వారాహి యాత్రను నిర్వహించారు. నాలుగో విడత యాత్రకు కృష్ణా జిల్లాను ఎంచుకున్నారు. మొత్తం నాలుగు నియోజకవర్గాల్లో యాత్ర సాగేలా పార్టీ నేతలు రూట్ మ్యాప్ ఖరారు చేశారు. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాలలో యాత్ర కొనసాగబోతుంది. ఇప్పటికే ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ యాత్రకు సంబంధించి ఆయా నియోజకవర్గాల నేతలతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఇంతకుముందు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను మచిలీపట్నంలో నిర్వహించారు. ఈ సభకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లారు. ఆ తర్వాత పవన్ అక్కడ ఎలాంటి పర్యటనలు చేయలేదు. ఇప్పటికే ఎమ్మెల్యేలు పేర్ని నాని, మంత్రి జోగి రమేష్ పదేపదే పవన్ పై తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. వారికి ఈ నియోజకవర్గాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ ఘాటుగా సమాధానం ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ తొలిసారిగా కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర చేపట్టనున్న నేపథ్యంలో విజయవంతం చేయడానికి ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

