ఏబీవీపీ మాజీ అధ్యక్షుడు, నిత్య కృషీవలుడు గుజ్జుల నర్సయ్య అస్తమయం
ఆయన స్ఫూర్తి ఎందరికో ఆదర్శం. ఆయన మాట ఎందరిలోనో ఆలోచన రేకెత్తిస్తోంది. ఆయన మాట చైతన్య స్రవంతి. తెలంగాణలో ఆరు దశాబ్దాలుగా ఎంతో మంది విద్యార్థులను మెరికల్లా తీర్దిదిద్ది విద్యార్థి ఉద్యమాలకు ప్రేరణగా నిలిచిన గుజ్జుల నర్సయ్య… 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), ఏబీవీపీ, ఇతర పరివార్ సంస్థలపై బెదిరింపులు వచ్చినా.. సమస్యలు సృష్టించినా ఆయన మాత్రం బెదిరిపోలేదు. ఆర్ఎస్ఎస్, బీజేపీలో కీలక పదవులు నిర్వర్తించి… జనజాగృతిలో జీవితాంతం పనిచేశారు. గుజ్జుల నర్సయ్య మృతి అటు పార్టీకి, ఇటు విద్యార్థి లోకానికి తీరని లోటుగా చెప్పాల్సి ఉంటుంది. హిందూ భావజాలన్ని నరనరాల నింపుకున్న ఆయన సనాతన సంప్రదాయాన్ని ఎలుగెత్తి చాటారు. పదేళ్లకే ఆర్ఎస్ఎస్‌లో దేశ సేవలో భాగస్వాములయ్యారు.

నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన అధ్యాపకుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఎన్నో పదవులు నిర్వర్తించారు. డిగ్రీ కాలేజీలో పనిచేస్తూ పదవీవిరమణ పొందారు. జీవితమంతా ద్యార్థి జీవితానికి అంకితం చేశారు. కార్యకర్తల హత్యలు జరుగుతున్నా… ప్రభుత్వాలు ఇబ్బందులు పెట్టినా వెనుదిరగలేదు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించి వారిని ఆదర్శ యువకుల్లా తీర్చిదిద్దారు. 1987-89 మధ్య కాలంలో రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అఖిలభారత విద్యార్థి పరిషత్ అధ్కక్షుడిగా పనిచేశారు. ఇక జాతీయ కార్యవర్గ సభ్యులుగా, విభాగ్ ప్రముఖ్‌గా, సంభాగ్ ప్రముఖ్‌గా సేవలందించారు. ఆర్ఎస్ఎస్ పరివారాలకు మార్గదర్శకులుగా ఉన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత బీజేపీలో చేరి పార్టీకి సేవ చేస్తూ వచ్చారు. నర్సయ్య మృతిపట్ల బీజేపీ ముఖ్యనేతలు కిషన్ రెడ్డి, సంజయ్, ఈటల సంతాపం తెలిపారు. ఆయన మృతి జాతీయవాదులకు తీరని లోటు అన్నారు. గుజ్జల నర్సయ్య మృతి విద్యార్థి లోకానికి తీరని లోటు అని ఏబీవీపీ పూర్వనాయకులు షేక్ మస్తాన్ వలీ అభిప్రాయపడ్డారు.