“నా కొడుకుపై తప్పుడు కేసులు పెట్టి, శునకానందం పొందుతున్నారు”…వైసీపీ నేత
రాజకీయ కోపముంటే నామీద తీర్చుకోండి అంతేకానీ నా కొడుకు మీద అక్రమ కేసు పెట్టి పాలకులు శునకానందం పొందుతున్నారని వైసీపీ నేత జోగి రమేశ్ సవాల్ చేశారు. రాజకీయాలలో పగ ఉంటే నాతో తీర్చుకోండి. అంతే కానీ అభం శుభం ఎరుగని, అమెరికాలో చదువుకుని వచ్చి, డెల్లాయిట్ లాంటి కంపెనీలో ఉద్యోగం చేస్తున్న నాకొడుకు ఏం చేశాడని అతడిని అరెస్టు చేశారు అంటూ వ్యాఖ్యానించారు జోగి రమేశ్. గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నేడు సీఐడీ విచారణకు హాజరయ్యారు జోగి రమేశ్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డ్ భూములు చట్ట ప్రకారమే వేలంలో కొనుగోలు చేశామని, దీనిలో అన్యాయంగా తన బిడ్డను ఇరికించారని మీడియాతో పేర్కొన్నారు. రెడ్ బుక్ తీసుకొచ్చి, వైసీపీని బలహీనం చేయాలని టీడీపీ ఆలోచిస్తోందన్నారు. దమ్ముంటే మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి చూపించండి అన్నారు. అమరావతిని, పోలవరాన్ని ఇప్పుడు ప్రభుత్వం కట్టి చూపించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, ప్రతీకార చర్యలు పక్కన పెట్టి అభివృద్ది పనులు చేసి చూపించాలన్నారు.

