సారూ… దేశం సంగతి తర్వాత తెలంగాణ హాస్టళ్లను పట్టించుకో జర…
పేదవిద్యార్ధులకు ఆలంబనగా ప్రభుత్వాలు మొదలుపెట్టిన సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల పరిస్థితి తెలంగాణాలో పతనావస్థతకు చేరుకుంటున్నాయి. రోజురోజుకు రోడ్లెక్కుతున్న విద్యార్ధుల గోడు సరైన కనీస మంచి భోజనం కూడా ఇవ్వని సర్కారు తీరుకు అద్దం పడుతోంది. మొన్నటికి మొన్న బాసర ట్రిపుల్ ఐటీలో కలుషితాహారం వల్ల అనారోగ్యానికి గురైన విద్యార్ధుల ఆందోళనల తర్వాత కూడా ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టడంలేదు. ఈనెల 15న ట్రిపుల్ ఐటీలో 600 మంది విద్యార్ధులు కలుషితాహారం వల్ల అనారోగ్యానికి గురయ్యారు. కాగా తాజాగా సోమవారం నిర్మల్ జిల్లా ముథోల్‌లో ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్ధులు అన్నంలో పురుగులు వస్తున్నాయని, మంచినీరు కూడా 5 రోజులుగా లభ్యం కావడంలేదని నిజామాబాద్-భైంసా రోడ్లపై ఆందోళనకు దిగారు.
తమ కుటుంబం తినే రకం బియ్యాన్నే తెలంగాణా హాస్టళ్లలో విద్యార్ధులకు అందిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం నేడు రుచిలేని కూరలు, పురుగుల అన్నం, ముక్కినబియ్యంతో వంట చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నా… ఇంత వరకు ఎలాంటి స్పందన లేదు. సిబ్బంది తక్కువగా ఉండడం, మిల్లుల నుండి వచ్చే బియ్యాన్ని తనిఖీ చేయకపోవడం ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంవత్సరం నిర్థారించినా… మెస్ రేట్లను గత ఐదేండ్లుగా పెంచలేదు. కరోనా వల్ల పెరిగిన మార్కెట్ ధరలతో పోలిస్తే ఇవి నిర్వహణకు సరిపోవడం లేదు. దీంతో మెనూలో కూడా నాణ్యత, పరిమాణం తగ్గిపోతున్నాయ్.
నాణ్యత గల ఆహారం అందించాలనే ముఖ్య డిమాండ్‌తో పాటు 12 సమస్యల పరిష్కారం కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు జూన్ 14 నుండి 21 వరకు నిరసన దీక్ష చేశారు. ఈ ఆందోళనతో రాష్ట్ర సర్కారు దిగిరాక తప్పలేదు. ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చిన విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి స్టూడెంట్స్ అడిగిన డిమాండ్లు అన్ని నెరవేరుస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. మంత్రి వచ్చి వెళ్లిన వారం రోజుల పాటు క్యాంటిన్ ఫుడ్ బాగానే పెట్టినప్పటికీ మళ్లీ ఎప్పట్లాగే మెను ఉన్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మెను కారణంగానే ఈ నెల 15 న మధ్యాహ్నం లంచ్‌లో భాగంగా పెట్టిన ఫ్రైడ్ రైస్‌ను తిని 600 మంది విద్యార్ధులు వాంతులు , విరోచనాలు చేసుకోగా , వారిలో 540 మందిని ట్రిపుల్ ఐటీలోని హాస్పిటల్‌లో మరికొంత మందిని భైంసా , ముధోల్, నవీపేట్, నిజామాబాద్‌లోని హాస్పిటల్‌లో ట్రిట్మెంట్ అందించగా . పరిస్థితి క్షీణించిన 60 మంది విద్యార్ధులను నిజామాబాద్ హోప్ ఆసుపత్రిలో చేర్చారు. మంత్రి హామీ ఇచ్చినా కూడా ట్రిపుల్ ఐటీలో మార్పు లేనందున విద్యార్థులు మరోసారి గలాటాకి దిగారు.
బాసర మాత్రమే కాదు, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని మహాత్మాజ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో కూడా మంచి ఆహారం దొరకడం లేదని ఈనెల 10న విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా గొడవ చేసారు. ఉడకని అన్నం, కూరలు పెడుతున్నారని, వాసన వస్తోందని, వర్షం పడితే గదుల్లోకి నీళ్లు వస్తున్నాయని, బాత్‌రూములకు తలుపులు లేవని గోడు వెళ్లబోసుకున్నారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో నిర్వహించారు. తరచూ ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతునే ఉన్నాయి. ఈనెల 7న తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు మెస్ లలో భోజనం అధ్వానంగా ఉందంటూ మెస్ లకు తాళాలు వేసి మరీ గొడవలు పెట్టారు.
గద్వాల జిల్లా గట్టు సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో కూడా 60 మందికి కలుషితాహారం వల్ల ఆసుపత్రి పాలయ్యారు. వారు కూడా నాణ్యత గల ఆహారం అందించాలని జూన్ 27న విద్యార్థులు ఆందోళనకు దిగారు. అదేరోజు సిద్దిపేట మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో 128 మంది అస్వస్థతకు గురయ్యారు. ముందు రోజు నిల్వ ఆహారమే కారణమని విద్యార్థుల వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి సొంతజిల్లాలోనే ఇదేం పరిస్థితేంటని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా భైంసాలో ఐదు రోజులుగా మంచి నీరు కూడా దొరకడంలేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ బంగారు తెలంగాణాగా గొప్పలు చెప్పుకొంటూ మొత్తం దేశమే తెలంగాణాను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి పాలన. కనీస అవసరాలకు కూడా విద్యార్థులు రోడ్లెక్కాల్సిన పరిస్థితి. సరైన కూడుకు కూడా పేదవిద్యార్థులు నోచుకోని దుస్థితి. సరైన నియంత్రణ, నాణ్యత లేని హాస్టళ్లు, గురుకులాలు, ప్రభుత్వ సొమ్ము ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి చేరుతోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం కళ్లు తెరచి నేటి విద్యార్థులే రేపటి పౌరులుగా గుర్తించి వారిపై శ్రద్ద వహిస్తే బాగుంటుంది.