కేసీఆర్‌కు ఈటల ఫైనల్ వార్నింగ్
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేసీఆర్ జుగుప్సాకరమైన భాష వాడుతున్నాడని.. ఆయన కుమారుడు కేటీఆర్ ఫాలో అవుతున్నారంటూ మండిపడ్డారు. కుటుంబ పాలన అంటూ ప్రశ్నిస్తుంటే అందుకు సమాధానం చెప్పాల్సింది పోయి చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాజగోపాల్ రెడ్డిపై డబ్బులకు ఆశపడ్డారని విమర్శలు చేస్తున్నారని… కేటీఆర్ పుట్టకముందే వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేశారని గుర్తుచేశారు. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చ కామెర్లు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నిబంధనల ప్రకారమే కాంట్రాక్ట్ వచ్చిందని… తడిబట్టలతో యాదగిరిగుట్ట టెంపుల్‌కు వస్తానని కోమటిరెడ్డికి సవాల్ విసిరారని… దానికి బదులివ్వలేకపోయారని ఎద్దేవాచేశారు.

సోషల్ మీడియాలో దొంగ అకౌంట్స్‌తో మోసం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు నమ్మబోరన్నారు. ఉపఎన్నికలు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు కోరుకుంటున్నారని… రాష్ట్రమంతటా రావాలని కోరుకుంటున్నారన్నారు ఈటల. మరో పార్టీలోకి వెళ్తూ.. రాజీనామా చేసి రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డి ఆదర్శంగా నిలిచారని… ధైర్యమంటే కొట్లాడాలి కానీ.. రండ పనులు చేయొద్దన్నారు. ప్రజలకు మేలు చేసి ఉంటే ఒక్కో ఎంపీటీసీకి సీఎం స్థాయి వ్యక్తిని నియమించడమేంటని ప్రశ్నించారు. గెర్రెల మీద తోడేళ్లలా పడుతున్నారని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. కేసీఆర్ పద్ధతి మార్చుకోవాలని హుజూరాబాద్ తీర్పును, మునుగోడు ప్రజలు రిపీట్ చేస్తారని ఈటల చెప్పారు.