NewsTelangana

కేసీఆర్ పాలన అంతం… బీజేపీ పంతం… పీయూష్ గోయల్

Share with

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఇద్దరు మంత్రులు ఒకే కుటుంబం నుంచి అధికారంలో ఉండి ప్రజలతో ఆడుకుంటున్నారన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. తెలంగాణా కోసం… ప్రజలు, యువత ప్రాణ త్యాగాలు చేశారన్నారు గోయల్. తెలంగాణ ఫలాలు ప్రజలకు అందకుండా గడచిన 8 ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్బంధ పాలన చేస్తోందన్నారు. తెలంగాణా రైతులు, దళితులు, పీడిత వర్గాలు, మహిళలు రాష్ట్ర ప్రభుత్వ పాలనతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణా ఆకాంక్షలను నెరవేర్చటంలో టీఆర్ఎస్ సర్కారు విఫలమైందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదాలపైనే తెలంగాణా ఏర్పడితే అవేవీ కూడా ప్రజలకు కేసీఆర్ అందించలేకపోయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పెద్ద ఎత్తున నిధులు వచ్చినా… అవినీతి రాజ్యమేలి ప్రజలు మేలు జరక్కుండా చేశారని విమర్శించారు. నీటి పారుదలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులోనే పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశారని… లక్ష 50 కోట్లను వెచ్చించినా ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి , నెట్టెంపాడు, దిండి ప్రాజెక్టుల్లో ఏదీ పూర్తి చేయలేదని విమర్శించారు పీయూష్ గోయల్. తెలంగాణాలోని కుటుంబ పాలనను అంతం చేసేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో స్థానిక బీజేపీ పనిచేస్తోందన్నారు.

దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, హుజూరాబాద్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయాలు సొంతం చేసుకుందన్నారు. తెలంగాణాలో మార్పును ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణా ప్రజల ఆశల్ని, ఆపేక్షలను పూర్తి చేసే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందన్నారు పీయూష్ గోయల్. హైదరాబాద్ నగరం నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నా… తగిన స్థాయిలో ఖర్చు చేయటం లేదన్నారు. అక్రమాలు ఉంటే విచారణ జరగాల్సిందేనన్నారు. ప్రధాని హైదరాబాద్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ పాటించలేదంటూ దుయ్యబట్టారు గోయల్. ప్రధానికి స్వాగతం పలకకపోవటంలో రాష్ట్ర ప్రభుత్వంలో భయం కనిపిస్తోందన్నారు. కార్యవర్గ సమావేశాలకు ముందు 48 గంటలపాటు కేంద్ర మంత్రులు, ప్రతినిధులు 119 నియోజకవర్గాల్లో పర్యటించి క్షేత్రస్థాయి అంశాలను తెలుసుకున్నారని… వచ్చే ఎన్నికల్లో బీజేపీ అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుందని… గెలిచితీరుతుందన్నారు. మోదీ పాపులారిటీని చూసి కేసీఆర్ భయపడుతున్నారన్నారు. ఇంటి నుంచి బయటకు రాని వ్యక్తి గడచిన రెండు రోజులుగా ప్రజల చుట్టూ తిరుగుతున్నారని పీయూష్ గోయల్ అన్నారు. తెలంగాణా ప్రకటన పై చర్చ సందర్భంగా స్థానిక నేత డీకే అరుణ ఇక్కడి పరిస్థితులను వివరించారని చెప్పారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగానూ తెలంగాణా ప్రజలకు కష్టాలు ఎక్కువయ్యాయని డీకే అరుణ ప్రకటనతో అర్థమయ్యిందన్నారు.