Andhra PradeshHome Page Slider

ఏపీలో సమ్మె బాటలో విద్యుత్ ఉద్యోగులు

ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పట్టబోతున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తూ దశలవారీగా వారి సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్న నేపథ్యంలో ఇన్నాళ్లు సమ్మె మాట ఎక్కడ కనిపించలేదు. రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న జెేఎల్ యం- 2 ఉద్యోగులను ఇటీవల ప్రభుత్వం క్రమబద్దీకరించింది. పీఆర్సీతో సహా పలు అంశాలపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో పలు దఫాలుగా ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపింది. అయితే సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వ విధానాలతో ఉద్యోగ సంఘాలు విభేదించాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం విద్యుత్ సౌద వద్ద మహాధర్మాకు పిలుపునిచ్చాయి. కానీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంతో అది సాధ్యపడలేదు. ఈ క్రమంలోనే విద్యుత్ ఉద్యోగులు తమ డిమాండ్లపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సమ్మెకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టబోతున్నారు. ఈ మేరకు సమ్మెకు సంబంధించిన పోస్టర్ ను విద్యుత్ ఉద్యోగులు విడుదల చేశారు. బుధవారం అర్ధరాత్రి నుంచి మొదలుపెట్టబోతున్న సమ్మెలో వాచ్మెన్ నుంచి ఇంజనీర్ వరకు అందరూ సమ్మెలో పాల్గొంటారని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు ప్రకటించారు.