ఏపీ భవిత నిర్ణయించే ఎన్నికలు, నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
ఏపీలో ఇవాళ అసలైన యుద్ధం జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత మూడోసారి జరగనున్న ఎన్నికలు సంక్షేమం, అభివృద్ధి, సామాజికవర్గాల చుట్టూ తిరుగుతోంది. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, ఇంకోవైపు కులం చుట్టూ తిరుగుతున్న ఈ ఎన్నికలో విజయం కోసం అటు వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రయత్నిస్తున్నాయ్. మొత్తంగా ఏపీలో ఇప్పుడు జరుగుతున్న సంక్షేమం జరగాలంటే, బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీల అభివృద్ధి కావాలంటే తననే ఎన్నుకోవాలని వైసీపీ అధినేత జగన్ చెబుతుంటే, అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జరగాలంటే తనతోనే సాధ్యమని టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్నారు. ఏపీలో పాలన వాలంటీర్ వ్యవస్థ రాక ముందు, వాలంటీర్ వ్యవస్థ తర్వాత అన్నట్టుగా జగన్ పాలన సాగితే.. ఇప్పుడు అంతకు మించి చేస్తానంటూ చంద్రబాబు ఓటర్లకు భరోసా ఇస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్, బీజేపీ కూటమిలో కీలక పాత్రలు పోషించడంతో ఏపీలో ఈ ఎన్నిక రసవత్తరంగా సాగుతోంది. ఓటర్లకు తాయిలాలు, ప్రలోభాలతో రెండు వర్గాలు ఎర వేయగా, ఇప్పుడు ఓటరు తీర్పు, మలిఘట్టానికి వేదిక కాబోతోంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. 25 లోక్ సభ స్థానాల్లో విజేతను ఓటర్లు నిర్ణయించనున్నారు. ఈసారి ఎన్నిక జగన్ అనుకూల, జగన్ వ్యతిరేక ఓటు చుట్టూ జరుగుతోందన్న ప్రచారం నడమ, తనను చూసి ఓటేయాలని జగన్ చెబుతుంటే, తనను నమ్మి ఓటేయాలని చంద్రబాబు చెబుతున్నారు.

