లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌లో ఈడీ విచారణ
లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు, తెలంగాణలో విచారిస్తున్న ఈడీ అధికారులు కీలక ఆధారాలను సేకరించినట్టుగా తెలుస్తోంది. మద్యం ముడుపులపై ఈడీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ప్రముఖ వ్యాపారి వెన్నమనేని శ్రీనివాసరావును నిన్న సుమారుగా ఏడు గంటల పాటు విచారించినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కాంట్రాక్టుల్లో వెన్నమనేని కంపెనీ కాంట్రాక్టు పొందినట్టు అధికారులు నిర్ధారించారు. కాంట్రాక్ట్ ఎలా దక్కించుకున్నారు… అసలేం జరిగిందన్నదానిపై ఈడీ అధికారులు ఆయనను లోతుగా విచారించారు. ఈడీ దేశ వ్యాప్తంగా కేసు విచారణను వేగవంతం చేసి 40 చోట్లకు పైగా సోదాలు నిర్వహించింది. రాజకీయ నేతల భాగస్వామ్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న తరుణంలో మొత్తం వ్యవహారంలో ఎవరెవరున్నారన్నదానిపై అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు విచారణకు భిన్నంగా ఇకపై రాజకీయ నేతలను విచారించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధులను కేసు నిమిత్తం విచారించే అవకాశం ఉంది.


